అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల(Afghanistan Taliban) అరాచకాలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బయటపెట్టింది. హజారా జాతికి చెందిన 13 మందిని కిరాతకంగా చంపారని తెలిపింది. వారిలో ఎక్కువమంది లొంగిపోయిన సైనికులే ఉన్నారని వెల్లడించింది. ఆగస్టు 30న దయకుంది ప్రావిన్స్‌లోని కహోర్ గ్రామంలో ఈ చర్యకు తాలిబన్లు(Afghanistan Taliban) పాల్పడినట్లు ఆమ్నెస్టీ దర్యాప్తులో వెల్లడైంది. 11 మంది అఫ్గాన్ భద్రతా సిబ్బంది, మరో ఇద్దరు పౌరులను తాలిబన్లు హతమార్చారు. అందులో 17 సంవత్సరాల బాలిక కూడా ఉన్నట్లు తేలింది. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను(Taliban news) ఆక్రమించుకున్న రెండు వారాల తర్వాత ఈ హత్యలు జరిగినట్లు పేర్కొంది.
ఆమ్నెస్టీ నివేదిక ప్రకారం.. దయకుంది ప్రావిన్స్‌ను ఆగస్టు 14న తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఖిదిర్ జిల్లాలో 34 మంది మాజీ సైనికులు దేశ భద్రతకు ఎంతగానో శ్రమించారు. అయితే తాలిబన్లు చుట్టుముట్టడం వల్ల ఆయుధాలతో పాటు వారికి లొంగిపోవడానికి మొహమ్మద్ అజీమ్ సెదాఖత్ నేతృత్వంలో బృందం అంగీకరించింది.
పారిపోతున్నా.. వదల్లేదు!
దహని కుల్ గ్రామంలో మరికొందరు సైనికులు తమ కుటుంబసభ్యులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని ఆగస్టు 30న.. 300 మంది తాలిబన్లు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తమకుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన సైనికులపై తాలిబన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 17ఏళ్ల బాలిక చనిపోయింది. ఓ సైనికుడు ఎదురుకాల్పులు జరపగా ఒక తాలిబన్ హతమయ్యాడు. మరికొందరు గాయపడ్డారు. దీంతో పారిపోతున్న సైనికుల కుటుంబాలపై కిరాతకంగా తాలిబన్లు కాల్పులు జరపగా.. ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో 9 మంది లొంగిపోయారు. వారిని ఓ నది తీరానికి తీసుకెళ్లి దారుణంగా చంపారని ఆమ్నెస్టీ తెలిపింది. హత్యల తర్వాత ఆ ప్రాంతంలో తీసిన ఫొటోలు, వీడియో ఆధారంగా వీటిని ధ్రువీకరించినట్లు పేర్కొంది.
అఫ్గాన్‌లో(Afghanistan latest news) 36 మిలియన్ల జనాభా ఉండగా.. అందులో హజారాలు దాదాపు 9 శాతం మంది ఉన్నారు. అఫ్గాన్ సున్నీ ముస్లింలు అధికంగా ఉన్న దేశం. అందుకే షియా ముస్లింలు అయిన హజారాలే లక్ష్యంగా తరచూ దాడులు జరుగుతుంటాయి! దీనిపై స్పందించిన ఆమ్నెస్టీ ప్రధాన కార్యదర్శి ఆగ్నెస్ కల్మార్డ్.. తాలిబన్లు(Taliban news) ఎంతటి దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడతారో.. ఈ హజారాల మరణశిక్షలే నిదర్శనమని అన్నారు.
ఇదీ చూడండి:Afghan Taliban: తాలిబన్ల పాలనలో మీడియాపై ఉక్కుపాదం..