Taliban Human Rights Watch report: అఫ్గాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు తమ రాక్షస నైజాన్ని చాటుకుంటున్నారు. వంద మందికి పైగా మాజీ పోలీసులు, నిఘా సంస్థల అధికారులను లక్ష్యంగా చేసుకున్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ అధికారులంతా హత్యకు గురికావడమో, అదృశ్యం కావడమో జరిగిందని 'హ్యూమన్ రైట్స్ వాచ్' సంస్థ వెల్లడించింది. అందరికీ క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. గత ప్రభుత్వం తరఫున పని చేసిన వారిపై ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.
Afghanistan Taliban news: ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి ఉద్యోగుల కోసం తాలిబన్లు వెతుకుతున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక తెలిపింది. ఎవరినైతే లక్ష్యంగా చేసుకోవాలో వారి వివరాలను స్థానిక తాలిబన్ కమాండర్లు సేకరిస్తున్నారని వెల్లడించింది. ఈ ఉద్యోగులు క్షమించరాని నేరాలు చేశారని తాలిబన్లు ఆరోపిస్తున్నారని పేర్కొంది.
"అఫ్గాన్ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి హత్యలను చూసి మాజీ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారు. తూర్పు నంగర్హార్ ప్రావిన్సులోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు సహకరిస్తున్న వ్యక్తులను సైతం తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారు. క్షమాభిక్ష ప్రకటించినప్పటికీ.. ఆర్మీ మాజీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోకుండా స్థానిక కమాండర్లను నియంత్రించలేకపోతున్నారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 మధ్య 47 మంది సాయుధ దళాల మాజీ అధికారులు హత్యకు గురికావడమో, అదృశ్యమవడమో జరిగింది. మరో 53 మంది మాజీ ఉద్యోగులు సైతం మరణించడమో, కనిపించకుండా పోవడమే జరిగినట్లు తాము చేపట్టిన పరిశోధనలో తేలింది."