ఇంటర్నెట్ నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేయాలంటే అది దాని వేగంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా డౌన్‌లోడ్ చేయాలంటే 100 ఎంబీపీఎస్ వేగం ఉంటే ఐదారు నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసేయొచ్చు. అయితే, సెకనులో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వెయ్యి సినిమా డౌన్‌లోడ్ చేశారట ఆస్ట్రేలియన్ పరిశోధకులు. అది కూడా హెచ్‌డీ(హై డెఫినేషన్) సినిమాలు. అవును మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియాలోని మోనాష్, స్విన్‌బర్న్, ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తయారు చేసిన సింగిల్ ఆప్టికల్ చిప్‌తో దీన్ని సుసాధ్యం చేశారు.
సెకనుకు 44 టెరాబైట్లు
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బిల్ కోర్‌కోరన్(మోనాష్), ప్రొఫెసర్ అరాన్ మిచెల్ (ఆర్‌ఎంఐటీ), ప్రొఫెసర్ డేవిడ్ మోస్(స్విన్ బర్న్)లు దీనిపై అధ్యయనం చేశారు. సెకనుకు 44.2 టెరాబైట్ల వేగంతో పనిచేసే చిప్‌ను వీరు తయారు చేశారు. 80 లేజర్ల సామర్థ్యం కలిగిన పరికరాన్ని రూపొందించారు. దీన్ని మైక్రో కోంబ్‌గా పిలుస్తున్నారు. లైటర్ కన్నా చిన్నదిగా ఉన్న ఈ చిప్ టెలికమ్యూనికేషన్‌లో వినియోగిస్తున్నారు.