ఎలుక వీర్యంతో శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. దీన్ని అంతరిక్షానికి తరలించి.. అక్కడ ఎలుక పిల్లలపై రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందని పరిశోధనలు జరుపుతుంటారు. ఈ వీర్యాన్ని గ్లాస్ బాటిళ్లలోనే ఒక చోట నుంచి మరో చోటకు పంపుతుంటారు. ఒక్కో సారి బాటిళ్లు పగిలి వీర్యం నిరుపయోగమవుతుంది.
అయితే ఈ సమస్యను అధిగమించేందుకు జపాన్ శాస్త్రవేత్తలు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. ఎలుక వీర్యాన్ని ప్లాస్టిక్ షీట్లలో భద్రపరిచి సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించే విషయంలో సఫలీకృతమయ్యారు. ఈ కొత్త పద్ధతి ద్వారా నిర్వహణ ఖర్చు తగ్గడమే గాక, అత్యంత సులభంగా రవాణా చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం ఆగస్టు 5న ఐసైన్స్ జర్నల్లో ప్రచురితమైంది. జపాన్లోని యమనాషి యూనివర్సిటీ ఈ పరిశోధన నిర్వహించింది. డయ్యూ ఇటో దీనికి నేతృత్వం వహించారు. ఇతర పద్ధతులతో పోల్చితే ఇది అత్యంత చౌకైనదని ఆయన చెప్పారు.
ఎలుక పిల్లలపై అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తెరుహికో వకయామా ల్యాబ్ నిర్వహించిన ప్రయోగంలో డయ్యూ ఇటో కూడా సభ్యులుగా ఉన్నారు. ఎలుక వీర్యాన్ని బాటిళ్లలో అంతరిక్షానికి తరలించి సఫలీకృతమైన తొలి ల్యాబ్ కూడా ఇదే.
అయితే గ్లాస్ బాటిళ్ల పద్ధతిలో ఒక్కోసారి అవి పగిలిపోవడమే కాకుండా, వాటికి ఎక్కువ చోటు కేటాయించాల్సి వస్తోంది. దీంతో కొత్త పద్ధతిపై వకయామా ల్యాబ్ దృష్టి సారించింది. తొలుత ప్లాస్టిక్ షీట్లలో ఎలుక వీర్యాన్ని భద్రపరిచింది. అయితే ప్లాస్టిక్ వల్ల వీర్యం విషపూరితమైంది. దీంతో ప్లాస్టిక్ కవర్ లోపల ఇతర పదార్థాన్ని ఉపయోగించి వీర్యాన్ని భద్రపరచాలని భావించారు. కవర్ లోపల బరువైన కాగితాన్ని చొప్పించారు. దానిలో ఎలుక వీర్యం నమూనాలు ఉంచి పోస్టు కార్డు ద్వారా ఇతర ప్రాంతానికి తరలించారు. అనంతరం ఈ వీర్యాన్ని ఉపయోగించగా ఆడ ఎలుకలు సంతానాన్ని పొందాయి. దీంతో తమ శ్రమకు ఫలితం దక్కిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచదేశాలన్నీ ఇదే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.