తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​ సైనిక చర్యపై ప్రపంచ దేశాల ఆందోళన - భారత్​ ఆందోళన

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుపై భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది. తాము ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య ప్రక్రియకు మద్దతుగా ఉంటామని తెలిపింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్న అమెరికా.. నిర్బంధంలోని నేతలను విడుదల చేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. సైనిక చర్యను ఐరాస ఖండించింది.

Military coup in Myanmar, Suu Kyi detained
మయన్మార్​ సైనిక చర్యపై భారత్​ సహా ప్రపంచ దేశాల ఆందోళన

By

Published : Feb 1, 2021, 10:51 AM IST

మయన్మార్​లో మరోమారు సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆంగ్​ సాన్​ సూకీ సహా కీలక నేతలను గృహ నిర్బంధం చేసింది. మయన్మార్​ రాజధాని నేపిడాలో టెలిఫోన్​, అంతర్జాల సేవలు నిలిపివేసింది.

తాత్కాలిక అధ్యక్షుడిగా..

మయన్మార్​ దేశ​ తొలి ఉపాధ్యక్షుడు మైంట్​ స్వీ.. తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారని సైన్యం ఆధీనంలోని మయావాడీ టీవీ ప్రకటించింది. నేషనల్​ లీగ్​ ఫర్​ డెమొక్రసీ నాయకురాలు ఆంగ్​సాన్​ సూకీని నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత.. ఈ మేరకు వెల్లడించింది. ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని మిలిటరీ ప్రకటించినట్లు తెలిపింది. దేశ అధికారాన్ని కమాండర్​-ఇన్​-చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ సర్వీసెస్​.. మిన్ హేలింగ్​కు అప్పగించనున్నట్లు పేర్కొంది.

భారత్​ సహా పలు దేశాల ఆందోళన..

  • మయన్మార్​లో జరిగిన తాజా పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్​ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య ప్రక్రియకు మద్దతు తెలుపుతుందని పేర్కొంది.
  • ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల మేరకు నడుచుకోవాలని మయన్మార్​ సైన్యానికి సూచించింది అమెరికా. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. మయన్మార్​లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. గృహ నిర్బంధంలో ఉన్న ఆంగ్​సాన్​ సూకీ, ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది.
  • మయన్మార్​లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని, గృహనిర్బంధంలో ఉన్న ఆంగ్​సాన్​సూకీ, ఇతర నేతలను వెంటనే సైన్యం విడుదల చేయాలని ఆస్ట్రేలియా డిమాండ్​ చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది.

ఖండించిన ఐరాస..

మయన్మార్​లో సైనిక తిరుగుబాటును తీవ్రంగా ఖండించారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. స్టేట్​ కౌన్సిలర్​ ఆంగ్​ సాన్​ సూకీ, అధ్యక్షుడు యూ విన్​ మైంట్​, ఇతర నేతలను నిర్బంధించటాన్ని తప్పుపట్టారు. అన్ని రకాల అధికారాలను సైన్యానికి బదిలీ చేయటంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు మయన్మార్​లో డెమొక్రటిక్​ సంస్కరణలను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. మయన్మార్​ ప్రజల హక్కులకు ఐరాస పూర్తి మద్దతు ఇస్తుందని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి:సైనిక నియంత్రణలో మయన్మార్​- సూకీ గృహ నిర్బంధం

ABOUT THE AUTHOR

...view details