2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆదేశాలిచ్చారన్న వార్తాకథనాలపై స్పందించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ఈ ఆరోపణలను పాంపియో కొట్టిపారేశారు. మీడియా నివేదికలు సరికాదన్నారు.
"నేను ఆ కథనం చూశాను. ఇలాంటి ఆరోపణలపై నేను మాట్లాడను. ఈ రకమైన కథనాలు చాలా ప్రమాదకరం. ఈ కథనం పూర్తిగా తప్పు."
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకే జరిగిందన్న వార్తలు తాజాగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీకి చెందిన రష్యా గూఢచారి స్పష్టం చేసినట్లు కథనాల సారాంశం.
అమెరికా గూఢచర్య సంస్థ ప్రజా సంబంధాల అధికారి బ్రిటానీ బ్రామేల్ ఈ వార్తా కథనాన్ని తోసిపుచ్చారు.
"మనదేశ గూఢచార్య విభాగం అధ్యక్షుడి చేతిలో ఉంది. ఈ వార్తా కథనం చాలా తప్పు. అధ్యక్షుడు ఎప్పుడైనా సీఐఏను ఉపయోగించుకోవచ్చు. వార్తా కథనం కేవలం తప్పుదారి పట్టించేదిగానే ఉంది."