అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచశక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా(China Space).. ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణమే లక్ష్యంగా.. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టింది. మరో ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపింది (China Space News Latest). వీరు అక్కడ 6 నెలలపాటు బసచేస్తారు. వేగంగా పురోగతి సాధిస్తున్న చైనాకు.. ఇదో కీలక మైలురాయిగా నిలవనుంది.
ఈ ప్రయోగం విజయవంతమైతే.. చైనా చరిత్రలో అత్యధిక కాలం మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టినట్లవుతుంది. గోబీ ఏడారిలో ఉన్న జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం రాత్రి ఈ యాత్ర ప్రారంభమైంది. షెంఝౌ-13 అనే వ్యోమనౌకలో వ్యోమగాములు పయనమయ్యారు. ఈ లాంగ్ మార్చ్ 2-ఎఫ్ రాకెట్ వ్యోమనౌక నింగిలోకి మోసుకెళ్లింది. వ్యోమగాములు.. తియాన్హే అంతరిక్ష కేంద్రంలో బసచేస్తారు.
వెళ్లింది వీరే..
ఈ దఫా పైలెట్ 55ఏళ్ల ఝాయ్ ఝిగాంగ్, మహిళా వ్యోమగామి 41ఏళ్ల వాంగ్‌యాపింగ్, 41 ఏళ్ల యె గువాంగ్‌పు.. రోదసిలోకి పయనమయ్యారు (China Space News). ఈసారి వ్యోమగాములు.. 3సార్లు స్పేస్ వాక్ నిర్వహిస్తారు. రోదసి కేంద్రానికి కొత్త సాధన సంపత్తిని అమరుస్తారు. అందులో నివాస యోగ్య పరిస్థితులను.. మదింపు చేస్తారు. అంతరిక్ష వైద్యశాస్త్రం, ఇతర రంగాల్లో ప్రయోగాలు చేస్తారు.
2003 నుంచి ఇప్పటివరకు చైనా 14 మంది వ్యోమగాములను.. రోదసిలోకి పంపింది(China Space). తియాన్హే అంతరిక్ష కేంద్రానికి.. ఇది రెండో మానవసహిత అంతరిక్ష యాత్ర. సెప్టెంబర్‌లో ముగిసిన మొదటి అంతరిక్షయాత్రలో ముగ్గురు వ్యోమగాములు 90 రోజులపాటు అక్కడే గడిపారు. మరిన్ని ప్రయోగాల ద్వారా రెండేళ్లలో సొంత అంతరిక్ష కేంద్రం.. నిర్మాణం పూర్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చూడండి:Mangalyaan mission: 6 నెలలు అనుకుంటే.. 7 ఏళ్లు దాటేసింది..!