అఫ్గాన్ ఒప్పందంపై ఎవరెలా వ్యాఖ్యానించినా- ఈ గ్రహం మీదే శక్తిమంతమైన సైనిక, ఆర్థిక శక్తిగా పేరొందిన అమెరికా... అనాగరిక అఫ్గాన్ జిహాదీ బృందాలను మచ్చిక చేసుకోవడంలో విఫలమైందని మాత్రం చెప్పక తప్పదు. ఆ ఒప్పందం అత్యంత స్పష్టంగా చెబుతున్నదిదే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని నమ్మింపజూస్తున్నట్లుగా ఇది శాంతి ఒప్పందం కాదు, వారికి లొంగిపోవడమే. ట్రంప్‌తోపాటు అదే తరహా ఆలోచనలు కలిగిన అమెరికన్ల దృష్టిలో మాత్రం ఇది మంచి ఒప్పందం! ప్రస్తుతం అమెరికా భావోద్వేగ స్థితిలో ఇది సరైన పరిణామమేనని భావిస్తున్నవారూ ఉన్నారు. ప్రపంచానికి పోలీసు మాదిరిగా వ్యవహరించే క్రమంలో భారీ స్థాయిలో డబ్బుల్ని, మనుషుల్ని నష్ట పోతుండటంపై అమెరికాలో అంతకంతకూ ఆందోళన పెరిగిపోతోంది. ఒక అంచనా ప్రకారం- అఫ్గానిస్థాన్ యుద్ధం కారణంగా అమెరికాకు రెండు లక్షల కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. సంకీర్ణ దళాలకు చెందిన మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అమెరికన్లే ఎక్కువ.
నాటో దళాలతో అమెరికన్ల పోరు..
2001లో మూడు వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి, ఎంతోమంది క్షతగాత్రులుగా మిగలడానికి కారణమైన 9/11 ఉగ్రదాడి అనంతరం తాలిబన్లు, ఒసామాబిన్ లాడెన్ పని పట్టేందుకు అమెరికన్లు నాటో దళాలతో పోరు ప్రారంభించారు. ఒక దశలో అఫ్గానిస్థాన్‌లో విదేశీ బలగాల సంఖ్య లక్షకు పైబడింది. తాలిబన్లు కొంతకాలం తగ్గినట్లుగా ఉన్నారు. పాకిస్థాన్ వారికి ఆశ్రయం సైతం కల్పించింది. ఆ తరవాత కొద్దికాలంలోనే తాలిబన్లంతా ఒక్కచోట చేరారు. తమ జిహాదీ ఉగ్రవాదంతో దేశాన్ని అస్థిరపరిచారు. మధ్యయుగాలనాటి విధానాల్ని అమలులోకి తెచ్చారు. ఫలితంగా మహిళలది బానిస బతుకుగా మారగా, పురుషులు ఏకపక్ష శాసనాలకు కచ్చితంగా లొంగి పడి ఉండాల్సిన స్థితిని తీసుకొచ్చారు. అమెరికా అండతో అఫ్గాన్‌లోని ఎన్నికైన ప్రభుత్వం కేవలం ప్రధాన పట్టణ కేంద్రాల వరకే పాలన సాగించగా, దేశం మారుమూల ప్రాంతాల్లో తాలిబన్లతో పూర్తిగా సహకరించిన గిరిజన భూస్వాములే పాలనపరమైన పెత్తనం చలాయించారు.
ట్రంప్ హామీ..
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైనికులను వెనక్కి తీసుకొస్తాననేది ట్రంప్ ఎన్నికల్లో చేసిన ప్రధాన హామీ. ఈ మేరకు ఖతర్‌ను ప్రధాన మధ్యవర్తిగా చేసుకొని తాలిబన్లతో అమెరికా చర్చలు సాగించింది. ఇక్కడ రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి- అఫ్గాన్ పరిణామాలకు సంబంధించినంత వరకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఎన్నడూ దూరంగా ఉండలేదు. తాలిబన్లకు ప్రధాన మార్గదర్శిగా సాగింది. ఈ ఒప్పందం కొలిక్కి వచ్చేందుకు అమెరికా పాకిస్థాన్‌పైనే ఆధారపడింది. రెండోది- చర్చలకు సంబంధించి అఫ్గాన్‌లోని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వ ప్రమేయం తక్కువే.