"పక్కవాళ్ల గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలుపెట్టారు సర్..? ఇదే సర్ మార్పంటే..
మీరు మారిపోయారు సర్.. మారిపోయారు అంతే..!"
ఇది ఓ చిత్రంలో హిట్ డైలాగ్.. అయితే ఈ మాటలు ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు సరిగ్గా సరిపోతాయి. ఎందుకు అంటారా? మరి జీవితంలో ఎప్పుడు లేనంత వింతగా ప్రవర్తిస్తున్నారు కిమ్.
ఒకప్పుడు కిమ్‌ను చూస్తే 'అమ్మో కిమ్మో' అనేవాళ్లు. ఆయన పేరు వినగానే దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో బంధించే నియంతృత్వ వైఖరి, అమెరికా వంటి అగ్రదేశానికే హెచ్చరికలు పంపే మేకపోతు గాంభీర్యం కళ్లముందు కదలాడతాయి. ఆయన క్రూరత్వం గురించి తెలియాలంటే ఈ ఒక్క సంఘటన చాలు.
అధికారం చేపట్టేనాటికి కిమ్ ఉన్ వయసు 27 ఏళ్లు. వయసులో చిన్నే కానీ హింసా ప్రవృత్తిలో ఆయన్ను మించిన వారుండరేమో. ఎంతగా అంటే తన తండ్రి మరణించినందుకు ఆ దేశ ప్రజలందరూ తీవ్రంగా బాధపడాలని కిమ్ ఆదేశించారు. సైనికుల్ని నియమించి కన్నీళ్లు కార్చని వారినీ తండ్రి సంతాప కార్యక్రమాలకు హాజరుకాని ప్రజలనూ బంధించి ఆరునెలల జైలు శిక్ష వేశారు.
అలాంటి కిమ్ ఈ మధ్య కన్నీరు కార్చడమేంటి? దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పడమేంటి? ఇలా కిమ్‌లో ఒకటా రెండా ఎన్నో మార్పులను ఇటీవల ప్రపంచ దేశాలు గమనించాయి. అయితే అందిరిని తొలిచేస్తోన్న ప్రశ్న మాత్రం ఒక్కటే.. కిమ్‌లో మార్పులకు కారణమేంటి?
ఎంత మారిపోయారు?
- అధికార వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా మిలిటరీ పరేడ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కిమ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో దేశాన్ని మార్గనిర్దేశం చేయడంలో తాను విఫలమయ్యానంటూ కిమ్ కన్నీరు పెట్టుకున్నారు.
"ఈ దేశ ప్రజలు నాపై ఎంతో నమ్మకం ఉంచారు. కానీ నేను వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాను. అందుకు నన్ను క్షమించండి. గ్రేట్ కామ్రేడ్స్ కిమ్-ఇల్-సంగ్, కిమ్-జోంగ్-ఇల్ నుంచి ఈ దేశాన్ని నడిపించే బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మా ప్రయత్నాలు, చిత్తశుద్ధి ప్రజల జీవితంలోని కష్టాలను తొలగించడానికి సరిపోలేదు"
- కిమ్ జోంగ్ ఉన్
- సాధారణంగా నూతన సంవత్సరం తొలి రోజున టీవీలో ప్రసంగించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఈ సారి సంప్రదాయాన్ని పక్కనబెట్టారు. ఇందుకు భిన్నమైన పద్ధతిలో ప్రజలకు సందేశాన్ని అందించారు.