బ్యాంకాక్‌లో ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో 'ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య' ఒప్పందం ఖరారయ్యే ఆవకాశాలు తగ్గిపోయాయి. ఇది ఇక 2020కి వాయిదా పడినట్లేనని ఆగ్నేయాసియా దేశాధినేతల ముసాయిదా ఒప్పంద ప్రకటన చెబుతోంది.
భారత్ ఒక్కటే..!
భారత్ నుంచి న్యూజిలాండ్ వరకు 16 దేశాల మధ్య ఆర్సీఈపీ ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రపంచంలో సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. మార్కెట్ అందుబాటు సంబంధిత చర్చలు చాలావరకు పూర్తయ్యాయని, కొద్దిపాటి ద్వైపాక్షిక అంశాలు 2020 ఫిబ్రవరి నాటికి కొలిక్కి వస్తాయని ముసాయిదా ఒప్పందంలో పేర్కొన్నారు.
సభ్యదేశాల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్నింటి తీర్మానాలు పూర్తయ్యాయని చెప్పడం భారత్‌ను ఉద్దేశించేనని భావిస్తున్నారు. ఆర్సీఈపీపై సంతకం చేయడానికి దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయని ప్రకటన పేర్కొంది.
చైనాపై అభ్యంతరం
భారత ప్రధాని నరేంద్రమోదీ బ్యాంకాక్‌లో ఆసియాన్ దేశాధినేతలతో ఆదివారం సమావేశమయ్యారు. చైనా చౌక వస్తువులు వెల్లువలా వచ్చి పడటం వల్ల తమ దేశంలో చిరు వ్యాపారుల పరిస్థితి దెబ్బతింటుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ అందుబాటు అనేది అన్ని పక్షాలకూ అర్థవంతమైన రీతిలో ఉండాలని మోదీ పునరుద్ఘాటించారు.
ఆర్సీఈపీ ఒప్పందం గురించి ఈ భేటీల్లో మాటమాత్రంగానైనా ఆయన ప్రస్తావించలేదు. ఆసియాన్‌తో భారత్ ఒప్పందం పునఃసమీక్ష కోసమే మాట్లాడారు.