తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా రక్షణమంత్రి ముందే తేల్చిచెప్పిన రాజ్​నాథ్​ - భారత్​ చైనా తాజా వార్తలు

సరిహద్దుల్లో యథాతథస్థితిని మార్చేందుకు చైనా చేస్తున్న యత్నాలను ఆ దేశ రక్షణ మంత్రి ముందే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఎండగట్టారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనా రక్షణ మంత్రి జనరల్ వి.ఫెంగే విజ్ఞప్తి మేరకు మాస్కోలో నిన్న సమావేశమయ్యారు రాజ్‌నాథ్‌. చైనా‌ ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని తేల్చి చెప్పారు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించే అంశమే ప్రధాన అజెండాగా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు భారత రక్షణమంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది.

Rajnath told China's counterpart
చైనా రక్షణమంత్రి ముందే తేల్చిచెప్పిన రాజ్​నాథ్​

By

Published : Sep 5, 2020, 1:57 PM IST

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చైనా రక్షణ మంత్రి జనరల్‌ వి.ఫెంగేతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోతుగా చర్చించారని రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయం (ఆర్​ఎమ్​ఓ) వెల్లడించింది. చైనా రక్షణ మంత్రితో సుమారు 2 గంటల 20 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో సరిహద్దుల్లో డ్రాగన్‌ దూకుడుపై రాజ్‌నాథ్‌ అసహనం వ్యక్తం చేశారని తెలిపింది.

కొన్ని నెలలుగా గల్వాన్ లోయతో సహా వాస్తవాధీన రేఖ వెంట జరిగిన పరిణామాలపై భారత వైఖరిని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ సమావేశంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరిస్తూ దూకుడుగా వ్యవహరిస్తూ చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేసినట్లు ఆర్​ఎమ్​ఓ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. దౌత్య, సైనిక మార్గాల ద్వారా ఇరుదేశాలు చర్చలు కొనసాగించాలని రాజ్‌నాథ్ వెల్లడించినట్లు పేర్కొంది. ఎల్‌ఏసీ వెంట శాంతిని పునరుద్ధరించేందుకు చైనా సహకరించాలని కోరారని ట్వీట్‌ చేసింది.

సరిహద్దు నిర్వహణ విషయంలో భారత దళాలు ఎప్పుడూ బాధ్యతాయుతంగానే మెలుగుతాయని ఈ సమావేశంలో రాజ్‌నాథ్‌ స్పష్టం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. భారత సార్వ భౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలనే సంకల్పంలో వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారంది. సరిహద్దుల్లో పరిస్థితిని క్లిష్టతరం చేసే చర్యలను ఇరు దేశాలు తీసుకోకూడదని రాజ్‌నాథ్ సూచించారని ఆర్​ఎమ్​ఓ తెలిపింది.

ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితి లేదని రాజ్​నాథ్​ ప్రస్తావించినట్లు పేర్కొంది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఇరుపక్షాలు అమలు చేయాలని రాజ్‌నాథ్‌ సూచించారని తెలిపింది. భారత-చైనా సంబంధాల మొత్తం పరిస్థితిపై ఇరుపక్షాలు దృష్టి సారించి.. వీలైనంత త్వరగా పరిస్థితిని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని రాజ్‌నాథ్‌ ఈ సమావేశంలో సూచించారు. భారత-చైనా సరిహద్దుల్లో శాంతి స్థాపనకు డ్రాగన్‌ పూర్తి సహకారం అవసరమన్నారు రాజనాథ్. సరిహద్దుల్లో సాధారణస్థితి నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పని చేయడం చాలా ముఖ్యమని రాజ్‌నాథ్‌ సూచించారని రక్షణశాఖ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది

ABOUT THE AUTHOR

...view details