అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల హస్తగతమైంది(Afghan Taliban). అనుకున్న డెడ్‌లైన్‌కు(ఆగస్టు 31) ముందే అమెరికా బలగాలు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. 20 ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరదించాయి(us troops leave afghanistan). దీంతో తాలిబన్లు సంబరాల్లో మునిగిపోయారు. రెండు దశాబ్దాల తమ కల నెరవేరిందని ఆనందపడుతున్నారు. అయితే తాలిబన్ల పాలనలో అఫ్గాన్ భవితవ్యంపై((Afghanistan News)) ప్రధానంగా 10 ప్రశ్నలు ఉతన్నమవుతున్నాయి.
1. నెక్స్ట్ ఏంటి?
అఫ్గాన్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. తమ పాలనా విధానాలు(Taliban Rule in Afghanistan) ఎలా ఉంటాయో ప్రపంచానికి, అఫ్గాన్ ప్రజలకు వెల్లడించాలి. 1990 నాటిలా తమ పరిపాలన ఉండదని, అందరికీ సమాన హక్కులు కల్పిస్తామని తాలిబన్లు చెబుతున్నా.. అవి అమలుకు నోచుకుంటాయో లేదో కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరంటే భయంతో వణికిపోతున్న ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
2. అమెరికా మాటేంటి?
తాలిబన్లు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ పాలనను ప్రపంచ దేశాలు సమ్మతించేలా నడుచుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ స్పష్టం చేశారు. అఫ్గాన్ ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవించేలా, మహిళలు, మైనారిటీల హక్కులు కాపాడేలా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేలా తాలిబన్ల ప్రభుత్వం ఉండాలన్నారు. అఫ్గాన్ ప్రజలు ఇతర దేశాలకు ప్రయాణించేందుకు, దేశం వీడేందుకు అనుమతించాలని చెప్పారు. వీటన్నింటినీ సరిగ్గా అమలు చేస్తేనే అఫ్గాన్‌తో సంబంధాలపై అమెరికా ఆలోచిస్తుందని(us on afghanistan) తేల్చి చెప్పారు. అంతేకాకుండా కాబుల్‌లోని తమ దౌత్య కార్యాలయన్ని మూసివేసి ఖతార్‌లోని దోహకు తరలించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి దౌత్య కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.
అఫ్గాన్‌లో ఇంకా 200 మంది అమెరికా పౌరులు, దేశాన్ని వీడాలనుకుంటుకున్న వేల మంది ఉన్నారు. వీరందరినీ తరలించే ప్రయత్నాలను కొనసాగిస్తామని బ్లింకెన్ చెప్పారు. తాలిబన్లు కూడా ఇందుకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
3. ఐరాస భద్రతా మండలి డిమాండ్లేంటి?
తాలిబన్లు కాబుల్‌ను హస్తం చేసుకున్న తర్వాత భారత్ నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) బలమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గాన్ కేంద్రం కాకూడదని, ఇతర దేశాలను బెదిరించేందుకు ఈ భూభాగాన్ని ఎవరూ ఉపయోగించకూడదని అందులో పేర్కొంది. యూఎన్ఎస్సీలో మొత్తం 15 సభ్య దేశాలుండగా.. 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా, చైనా మాత్రం వీటో హక్కును వినియోగించుకుని ఓటింగ్గు దూరంగా ఉన్నాయి.
కాబుల్ విమానశ్రయం(Kabul Airport) వద్ద ఆగస్టు 26న జరిగిన జంట పేలుళ్ల ఘటనను యూఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది.
4. ప్రపంచదేశాలు తాలిబన్ల పాలనను గుర్తిస్తాయా?
అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను(Afghanistan Taliban) ఇప్పట్లో గుర్తించే ప్రసక్తే లేదని అమెరికా తేల్చి చెప్పింది. దాని మిత్ర దేశాలది కూడా ఇదే మాట అని స్పష్టం చేసింది. అఫ్గాన్ నిధులపై కూడా ఆంక్షలు విధించింది. అయితే రష్యా, చైనా మాత్రం తాలిబన్లతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కాబుల్‌లోని తమ దౌత్య కార్యాలయాలను కూడా తెరిచే ఉంచాయి. తాలిబన్ల ప్రభుత్వంతో సాధారణ సంబంధాలు నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి జమిర్ కబులోవ్ వెల్లడించారు. ఎలాంటి ఆంక్షలు విధించే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అఫ్గాన్ ప్రజల సంస్కృతి మత సంప్రదాయాలను గౌరవిస్తామన్నారు. అయితే అఫ్గాన్‌లో సైనిక, రాజకీయ పరిస్థితిపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు.
అప్గానిస్థాన్‌లో అమెరికా మరోసారి వైమానిక దాడులు(US Airstrike in Afghan) నిర్వహించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కబులోవ్ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుక పశ్చిమ దేశాలు సహకరించాలున్నారు. అఫ్గాన్ నిధులపై అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఆ దేశానికి మరిన్ని కష్టాలు తెచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు. తమవంతు సాయంగా అఫ్గాన్‌కు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధమని స్పష్టం చేశారు.
5. భారత్‌పై తాలిబన్ల వైఖరి ఎలా ఉండబోతుంది?
భారత్‌తో తాము స్నేహసంబంధాలే కోరుకుంటున్నట్లు తాలిబన్లు(Taliban on India) ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను యథావిధిగా కొనసాగించాలని భావిస్తున్నట్లు తాలిబన్ల నాయకుడు షేర్ మహమ్మద్ స్తానెక్జాయ్ తెలిపారు. ఆసియా ఉపఖండంలో భారత్ అత్యంత కీలకమైన దేశమని స్పష్టం చేశారు.
6. తాలిబన్ల పట్ల భారత్ వైఖరేంటి?
అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను గుర్తించే విషయమై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ అంశం వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తోంది. అఫ్గాన్‌లో పరిస్థితిపై ఇటీవలే అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంది.
అయితే భారత్ పట్ల తాలిబన్లు సానుకూల దృక్పథంతో ఉండటానికి మరో కారణం ఉందని మాజీ రాయబారి జితేంద్ర త్రిపాఠి తెలిపారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తిస్తే దానివల్ల ఎంత ప్రయోజనమో వారికి తెలుసు అని వివరించారు. మిగతా దేశాలు కూడా తాలిబన్లపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని సంబంధాలు కొనసాగించడానికి ముందుకు వస్తాయని, అందుకే భారత్‌ను ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవాలని తాలిబన్లు భావించవచ్చని విశ్లేషించారు.
ఒకవేళ తాలిబన్లు అఫ్గాన్‌లో భారత్ పెట్టిన పెట్టుబడులకు, తమ పౌరులకు ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇస్తే.. కేంద్రం వారితో సంప్రదింపులు జరపవచ్చని త్రిపాఠి అభిప్రాయపడ్డారు. తాలిబన్ల ప్రకటనపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ.. వారి సందేశాన్ని తీవ్రంగా పరిశీలించాలన్నారు. తాలిబన్లతో భారత్ సంప్రదింపులు జరుపుతన్నప్పటికీ బహిరంగంగా ఏ విషయాలు వెల్లడించొద్దని సూచించారు.