అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఇరువురు మంత్రులు టోక్యోలో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత నెలకొనే విధంగా సమాలోచనలు చేశారు.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా(క్వాడ్) దేశాలతో కూడిన చతుర్భుజ కూటమి మంత్రుల సమావేశం కోసం ఆయా దేశాల మంత్రులు జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ పరిసరాల్లో ఇటీవల తలెత్తిన భద్రతా పరిణామాలపై పాంపియో, జైశంకర్ చర్చలు జరిపినట్లు తెలిసింది.
పాపింయోతో ద్వైపాక్షిక భేటీతో టోక్యో పర్యటన ప్రారంభించినట్లు జైశంకర్ ట్వీట్ చేశారు.
"సెక్రటరీ పాంపియోతో ద్వైపాక్షిక చర్చలతో టోక్యో పర్యటన ప్రారంభమైంది. ఇరుదేశాల మధ్య అనేక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతం కావడం సంతోషకరం. ఇండో పసిఫిక్‌లో స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలసికట్టుగా పనిచేస్తాం."
-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
భారత్-చైనాల మధ్య సైనిక ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత తొలిసారి వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక సముద్ర మార్గాలపై ఎవరి ఆధిపత్యం లేకుండా ఉంచేందుకు క్వాడ్‌ను 2017లో ఏర్పాటు చేశారు. క్వాడ్ తొలి సమావేశాలు న్యూయార్క్‌లో జరగ్గా, రెండో సమావేశాలు టోక్యోలో జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు టోక్యోలో పర్యటించనున్న జైశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటేగీ సహా ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి మెరిస్ పేన్‌తో చర్చలు జరపనున్నారు.