చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఏర్పడ్డ చతుర్భుజ కూటమి బలోపేతమవుతోంది. రోదసి రంగానికీ ఈ మైత్రి విస్తరిస్తోంది. ఈ దిశగా కూటమిలోని ఇతర దేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో అంతరిక్ష బంధాన్ని భారత్ పటిష్ఠం చేసుకుంటోంది. చతుర్భుజ కూటమి శిఖరాగ్ర సదస్సు గతవారం జరిగిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు, కీలక, సరికొత్త పరిజ్ఞానాలు, భవిష్యత్ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించడానికి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని కూటమి దేశాలు నిర్ణయించాయి.
అంతరిక్ష రంగంలోనూ నాలుగు దేశాలు ఉమ్మడిగా సాగేందుకు అడుగులు వేస్తున్నాయి. అమెరికాతో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న నిసార్ ఉపగ్రహం కోసం భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక ఎస్-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ను ఇటీవల రూపొందించింది. దీన్ని వచ్చే ఏడాది శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. చంద్రుడిపైకి భారత్ పంపే చంద్రయాన్-3లో నాసాకు చెందిన లేజర్ రిఫ్లెక్టోమీటర్ అరే (ఎల్ఆర్ఏ)ను అమర్చేందుకు రెండు దేశాలు కసరత్తు చేస్తున్నాయి.