రష్యాలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 1,028 మరణాలు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్ల నుంచి ఇవే అత్యధికం. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగులకు వారం రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. కేబినెట్ చేసిన ఈ ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు.
అక్టోబర్ 30నుంచి వారం రోజుల పాటు ఈ సెలవులు ఉంటాయి. అయితే అందులో నాలుగు రోజులు అధికారిక సెలవులే. మరో మూడు రోజులే అదనంగా ఇస్తోంది ప్రభుత్వం.
రష్యాలో గత వారం రోజులుగా సగటున రోజుకు 1000 కరోనా మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 226,353కి చేరింది. పలు ప్రాంతాల్లో వైరస్ తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉంది. దీంతో కొన్ని ఆస్పత్రుల్లో ఇతర వైద్య సేవలను నిలిపివేసి కేవలం కరోనా రోగులకే చికిత్స అందిస్తున్నారు.
కరోనా టీకాకు మొట్ట మొదట రష్యా ప్రభుత్వమే గతేడాది ఆగస్టులో అమోదం తెలిపింది. అయినా టీకా వేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపనందు వల్ల వ్యాక్సినేషన్ నత్త నడకన సాగుతోంది. మొత్తం 14.6కోట్ల మంది జనాభా ఉన్న రష్యాలో.. ఇప్పటి వరకు 32శాతం మంది(4.5కోట్లు) మాత్రమే టీకా రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. స్పుత్నిక్ వీతో పాటు మరో మూడు స్వదేశీ టీకాలకు రష్యా ప్రభుత్వం అనుమతిచ్చింది. పాశ్చాత్య దేశాల టీకాలపై విమర్శలు గుప్పించింది. దీంతో వ్యాక్సిన్లపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి:మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు- ఆపరేషన్ సక్సెస్!