తెలంగాణ

telangana

ETV Bharat / international

లంకలో రేపే అధ్యక్ష ఎన్నికలు: రాజపక్స X ప్రేమదాస - సాజిత్ ప్రేమదాస, పాలక పార్టీ అధ్యక్ష అభ్యర్థి

దేశ భవిష్యత్తును నిర్ణయించే అధ్యక్ష ఎన్నికలకు శ్రీలంక సిద్ధమైంది. ఈస్టర్ బాంబు పేలుళ్ల తర్వాత భద్రతా సవాళ్లతో పోరాడుతున్న లంకలో నూతన అధ్యక్షుడి ఎన్నికల పోలింగ్‌ రేపు జరగనుంది. రికార్డు స్థాయిలో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన 35 మంది అభ్యర్థులు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో నేతలు హామీలు గుప్పించారు. కోటీ 59 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

లంకలో రేపే అధ్యక్ష ఎన్నికలు: రాజపక్స X ప్రేమదాస

By

Published : Nov 15, 2019, 8:06 PM IST

లంకలో రేపే అధ్యక్ష ఎన్నికలు: రాజపక్స X ప్రేమదాస

భయంకరమైన ఈస్టర్​ బాంబు పేలుళ్ల అనంతరం.. భద్రతా సవాళ్లతో పోరాడుతున్న శ్రీలంకలో అధ్యక్షుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. శనివారమే ఈ ద్వీపదేశంలో పోలింగ్​ జరగనుంది. కోటీ 59 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2 కోట్ల 20 లక్షల మంది జనాభా ఉన్న శ్రీలంకలో జరిగే ఎన్నికలను భారత్‌, చైనాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

అధ్యక్ష ఎన్నికల బరిలో 35 మంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన సాజిత్ ప్రేమదాస, శ్రీలంక పోదుజన పెరామునా పార్టీకి చెందిన గోటబయా రాజపక్సల మధ్యే నెలకొంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో నేతలు హామీలు గుప్పించారు.

రెండు వర్గాలుగా చీలిపోయిన ఫ్రీడమ్​పార్టీ....

ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. ఆయనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ నుంచి కూడా ఎవరూ ఎన్నికల బరిలో నిలవలేదు. సైద్ధాంతికంగా ఫ్రీడమ్‌పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం రాజపక్సకు మద్దతిస్తోంటే, మరో వర్గం సాజిత్ ప్రేమదాసకు మద్దతు తెలుపుతోంది. ఈ ఘటనతో రాజపక్స, ప్రేమదాస మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

శ్రీలంక అంతర్గత భద్రత ఈ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈస్టర్‌ వేడుకల్లో జరిగిన బాంబు దాడిలో 269 మరణించిన తర్వాత లంకేయులు భద్రతపై ఆందోళనగా ఉన్నారని ఈ ఎన్నికల్లో జాతీయ భద్రతపై భరోసా ఇచ్చేవారివైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్సకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాలున్నాయి. తమను ఈసారి గెలిపిస్తే జాతీయ భద్రతను బలోపేతం చేస్తామని శ్రీలంకను సురక్షితంగా మారుస్తామని ప్రధాన పార్టీల అధ్యక్ష అభ్యర్థులు హామీనిస్తున్నారు.

''మీరు నాకు ఇచ్చేది దేశ బాధ్యత. ఈ దేశాన్ని సుసంపన్నం చేసే బాధ్యత నాది. మీ ఆకాంక్షలను నెరవేరుస్తాను. ప్రజలందరూ నాపై నమ్మకం ఉంచండి. మీ బాధ్యతను నెరవేర్చండి. సురక్షితమైన, సంపన్నమైన, గర్వించదగిన శ్రీలంకను మీకు అప్పగించే బాధ్యత నాది. దాన్ని నెరవేరుస్తానని మీకు హామీనిస్తున్నాను.''

- గోటబయ రాజపక్సే, ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థి

''అన్ని రకాల ఉగ్రవాదాన్ని అరికడతాను. జాతి, మత ఆధారిత ఉగ్రవాదాన్ని సహించను. జాతీయ భద్రత విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం.''

-సాజిత్ ప్రేమదాస, పాలక పార్టీ అధ్యక్ష అభ్యర్థి

ఈ ఎన్నికల్లో ఎవరు అధ్యక్షులైనా భారత్, శ్రీలంక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం లేదని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు వెల్లడిస్తున్నారు. లంకలో అధికారంలోకి ఎవరు వచ్చినా వారితో జట్టు కట్టేందుకు భారత్ సిద్ధంగా ఉండొచ్చని వారు వివరిస్తున్నారు. తమిళుల విషయంలో రాజపక్స కుటుంబం వైఖరి, చైనాతో వారికి గల సాన్నిహిత్యం అంశాలను భారత్ ప్రతిఘటిస్తోంది.

భారత్​,చైనాలతో స్నేహం అలానే...

అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా పొరుగు దేశాల సంబంధాల్లో పెద్దగా మార్పు ఉండబోదని ఇద్దరు అభ్యర్థులూ భారత్‌, చైనాలతో స్నేహనే కోరుకుంటున్నారని శ్రీలంక రాజకీయ విశ్లేషకుడు కాతీర్కామార్ వివరించారు. చైనాను వదిలి... తమతో సంబంధాలు కలుపుకోవాలని పట్టుపట్టే పరిస్థితిలో భారత్‌, అమెరికా లేవని ఆయన విశ్లేషించారు. చైనాతో సఖ్యతగా ఉన్నా.... భారత్‌తో సత్సంబంధాలు మరింత మెరుగయ్యే దిశగా అడుగులేస్తామని శ్రీలంక దేశాధ్యక్షుడి సలహాదారు సమన్ వీరసింఘే స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య మైత్రికి మించిన బంధముందన్న ఆయన భారత్‌ శ్రీలంకది 1000 ఏళ్ల నాటి బంధమని గుర్తు చేశారు.

నిశితంగా గమనిస్తోన్న భారత్​,చైనా...

లంకేయులు నూతన సారధిగా ఎవరిని ఎన్నుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నందున భారత్‌, చైనాలు.. శ్రీలంక పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అధ్యక్షుడి ఎన్నికలు ముగిసిన తర్వాత అవలంబించాల్సిన విధానాలపై కసరత్తు చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details