కరోనా వైరస్ను కట్టడి చేయటంలో సఫలమైనట్లు తెలిపేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 ప్రమాద స్థాయులను తగ్గించింది చైనా. దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలను హెచ్చరించారు అధ్యక్షుడు షి జిన్పింగ్. కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తి స్థాయిలో కట్టడి కాలేదని.. తప్పనిసరిగా వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు.
కరోనా వైరస్ నివారణ, నియంత్రణ మార్గదర్శక బృందంతో గురువారం సమావేశమయ్యారు అధ్యక్షుడు జిన్పింగ్. ఈ బృందం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అయితే.. ప్రజలు వ్యక్తిగత భద్రతపై నిర్లక్ష్యం వహించటం తగదని హెచ్చరించారు.
"విదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటికీ సమర్థవంతంగా కట్టడి కాలేదు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం.. ఈ మహమ్మారి నివారణ చర్యల్లో అనిశ్చితిని కలిగిస్తుంది. హుబే రాష్ట్రంలో ఈ వైరస్ నివారణ, నియంత్రణ చర్యలను సడలించొద్దు."