పేదరికాన్ని చైనా విజయవంతంగా అధిగమించిందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలలో 77 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశం సాధించిన అద్భుతాల్లో ఇది ఒకటని, ఈ సంపూర్ణ విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పేదరిక నిర్మూలన అంశంపై బీజింగ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు జిన్‌పింగ్.
"ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాం. 'చైనా పేదరిక రేఖ' సూచీని బట్టి చూస్తే 1970ల్లో సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాతి నుంచి 77 కోట్ల మంది గ్రామీణ ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ఫలితంగా.. 2030లోపు పేదరిక నిర్మూలన సాధించాలన్న ఐరాస లక్ష్యాన్ని పదేళ్ల ముందుగానే సాధించాం."
-జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 9 కోట్ల 89 లక్షల మంది పేదలను గత ఎనిమిదేళ్లలో దారిద్ర్య రేఖ ఎగువకు తీసుకొచ్చినట్లు వివరించారు జిన్‌పింగ్. పేదరిక జాబితాలో ఉన్న 832 కౌంటీలు, లక్షా 28 వేల గ్రామాలను అందులో నుంచి తొలగించినట్లు చెప్పారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత 1.6 ట్రిలియన్ యువాన్ల(సుమారు రూ.18 లక్షల కోట్లు)ను పేదరిక నిర్మూలనపై వెచ్చించినట్లు తెలిపారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో ప్రపంచ పేదరిక నిర్మూలనలో చైనా వాటా 70 శాతానికి పైగా ఉందని అన్నారు. 28 జాతిపరమైన మైనారిటీ సమూహాలను పేదరికం నుంచి వెలికితీసినట్లు చెప్పారు.