తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ విమాన ప్రమాదంపై కొత్త సందేహాలు! - pak plane crash updates

పాకిస్థాన్ కరాచీలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై అధికారుల ప్రాథమిక నివేదికతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైలట్ వ్యవహరించిన తీరు, కాక్​పిట్​లోని సిబ్బంది ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​కు సమాచారం ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

Preliminary report of PIA plane crash raises new questions
ప్రాథమిక నివేదికతో పాక్ విమాన ప్రమాదంపై సందేహాలు!

By

Published : May 24, 2020, 7:00 PM IST

పాకిస్థాన్​ కరాచీలో విమానం కుప్పకూలిన ఘటనలో 97 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారుల ప్రాథమిక నివేదికలో ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవతున్నాయి. పైలట్ తీరు, అత్యవసర పరిస్థితిలో కూడా కాక్​పిట్​లోని సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్​ కంట్రోల్​కు సమాచారం ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్లు జియో న్యూస్ తెలిపింది.

విమాన ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమా? లేక పైలట్​ తప్పిదమా అనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పాక్ పౌర విమానయాన శాఖ అధికారులు.

నివేదికలో కీలక విషయాలు..

  • విమానాన్ని ల్యాండ్​ చేసేందుకు పైలట్ చేసిన మొదటి ప్రయత్నంలో ఇంజిన్లు మూడు సార్లు రన్​వేపై కుదుపులకు గురయ్యాయి.
  • అనంతరం పైలట్ విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాడు. ఈ చర్య వింతగా ఉంది.
  • ల్యాండింగ్​ సమస్యపై కాక్​పిట్​లోని సిబ్బంది జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్ (ఏటీసీ)​కు సమాచారం ఇవ్వలేదు.
  • అత్యవసర పరిస్థితిలో విమానంలో స్వయంచాలక వ్యవస్థ పనిచేయదు. పెద్ద శబ్దాలతో వచ్చే హెచ్చరికలను విస్మరించలేం. దీనిపై పైలట్​ ఏటీసీకీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
  • ల్యాండింగ్​ చేసిన మొదటి ప్రయత్నంలోనే ఆయిల్ ట్యాంక్​, ఇంధన పంపు దెబ్బతిని లీకేజీ అయి ఉంటుంది.
  • విమానాన్ని రెండోసారి ల్యాండ్ చేయాలనే ప్రయత్నం పైలట్​ సొంత నిర్ణయం. ఈ సమయంలో ల్యాండింగ్​ సమస్యపై ఏటీసీకి సమాచారం అందింది.
  • విమానాన్ని 3 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాలని పైలట్​కు ఏటీసీ సూచించింది.
  • పైలట్ మాత్రం 1800 అడుగుల వరకే తీసుకెళ్లాడు. 3 వేల అడుగులకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాక్​పిట్​లోని సిబ్బంది ఏటీసీకి తెలిపారు.
  • ఇంజిన్​ సరిగ్గా పనిచేయక పోవడం వల్లే పైలట్ 3 వేల అడుగుల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లలేకపోయి ఉంటాడని నిపుణులు చెబుతున్నారు.
  • ఆ తర్వాత అకస్మాత్తుగా విమానం గాల్లో చక్కర్లు కొడుతూ కరాచీలోని జనావాసంలో కుప్పకూలింది. విమానం చాలా వేగంగా నేలకూలినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

మొదటిసారి ల్యాండింగ్ సమస్య వచ్చినప్పుడే పైలట్ ఎందుకు సమాచారం ఇవ్వలేదని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో పెద్ద శబ్దాలతో హెచ్చరికలు వచ్చే అలారం వ్యవస్థ పనిచేయక పోవడం ఏంటని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఘటనపై పూర్తి నివేదికను మూడు నెలల్లో ప్రభుత్వానికి అందజేయనున్నారు అధికారులు.

మార్చి 21న ఈ విమానం పనితీరును పరీక్షించారు. ప్రమాదానికి ఒక్కరోజు ముందు మస్కట్​ నుంచి లాహోర్ చేరుకుంది ఈ విమానం.

ABOUT THE AUTHOR

...view details