Pregnant women not allowed to hospital: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రస్తుత తరుణంలో.. వైద్యులే 'దేవుళ్లు'గా ప్రశంసలు అందుకుంటున్నారు. తమకు ప్రాణహాని ఉన్నా లెక్క చేయకుండా.. ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే... ఓ ఆస్పత్రిలోని వైద్యాధికారులు మాత్రం అమానుషంగా ప్రవర్తించారు. కొవిడ్ నిబంధనల పేరుతో గర్భిణీని ఆస్పత్రిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఫలితంగా ఆమెకు గర్భస్రావమైంది. ఈ ఘటన చైనాలోని ఓ నగరంలో జరిగింది. దీనికి బాధ్యులైన ఆస్పత్రి అధికారులపై స్థానిక ప్రభుత్వం వేటు వేసింది.
అసలేం జరిగింది?
Covid rules in china: ఉత్తర చైనా నగరమైన షియాన్‌లో గావోగ్జిన్ ఆస్పత్రికి నూతన సంవత్సరం రోజున తీవ్ర నొప్పులతో ఓ గర్భిణీ తన భర్తతో కలిసి వెళ్లింది. అయితే... కొవిడ్ పరీక్షల ఫలితాలు లేవన్న కారణంతో అధికారులు ఆమెను ఆస్పత్రి లోపలికి అనుమతించలేదు. నొప్పితో విలవిలాడిన ఆమె ఆస్పత్రి బయటే ఓ పింక్ ప్లాస్టిక్ స్టూల్‌పై కూర్చుండిపోయింది. తీవ్ర రక్తస్రావమయ్యే వరకు ఆమెను అధికారులు ఆస్పత్రిలోకి అనుమతించలేదు. ఆమె భర్త తీసిన వీడియోలో.. ఆ మహిళ కాళ్ల వద్ద రక్తపు మడుగు కనిపించింది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా... షియాన్ నగర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గావోగ్జిన్ ఆస్పత్రి జనరల్ మేనేజర్ ఫ్యాన్ యుహుహి సహా ఔట్ పేషంట్ విభాగం అధిపతులు, ఇతర వైద్య సిబ్బందిని విధుల నుంచి గురువారం సస్పెండ్ చేసింది. ఆస్పత్రి అధికారుల చర్యలు.. 'సమాజంలో విస్తృత ఆందోళన, సమాజంపై తీవ్ర ప్రభావం చూపగలవు' అని ఓ ప్రకటనలో పేర్కొంది.