నేపాల్ రాష్ట్రపతి బైద్యదేవి భండారితో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు పుష్పకమల్ దహల్ ప్రచండ గురువారం భేటీ అయ్యారు. కేబినెట్ సిఫార్సు మేరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ప్రారంభించిన అనంతరం ఈ భేటీ జరిగింది.
అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో చీలికలు మొదలయ్యాయన్న వార్తల నడుమ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భండారి కూడా ఎన్సీపీకి చెందిన మాజీ నాయకురాలే కావటం వల్ల తాజా పరిణామాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అంతకుముందు రాష్ట్రపతి భండారితో ప్రధాని కేపీ శర్మ ఓలి గురువారం భేటీ అయ్యారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు ఓలి. ఇదే విషయంపై ప్రచండతోపాటు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దౌబాతో వేర్వేరుగా ఓలి సమావేశమయ్యారు.
రాజీనామాకు డిమాండ్..
అయితే ఓలి రాజీనామా డిమాండ్‌పై పార్టీ అగ్రనేతలు ఏకాభిప్రాయానికి రాకపోవటం వల్ల ఎన్సీపీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగానూ సమర్థనీయం కాదని, ఓలి రాజీనామా చేయాలని ఎన్సీపీ ముఖ్యనేతలు మంగళవారం డిమాండ్ చేశారు.
భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు..
కాఠ్మాండులోని ఓ హోటల్లో తనను పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని కేపీ ఓలి ఇటీవల ఆరోపించారు. ఇందులో ఒక ఎంబసీ కీలకంగా వ్యవహరిస్తోందని భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయం కుట్ర పన్నుతోందన్నారు. ఇటీవల నేపాల్ జాతీయ పటం సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఓలి ఆరోపించారు.
ఇదీ చూడండి:నేపాల్ ప్రధానికి ఎందుకీ 'రాజీ'నామా కష్టం?