Power outages: మధ్య ఆసియా దేశాలైన కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో మంగళవారం విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లారు. కజికిస్థాన్లోని అతిపెద్ద నగరం ఆల్మటీలో 20 లక్షల మందికి కరెెంట్ సరఫరా నిలిచిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. తుర్కిస్థాన్ దక్షిణ ప్రాంతంలోని షైమ్‌కెంట్, జంబిల్లోని పలు ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు అవస్థలు పడినట్లు తెలిపింది.
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్, ఉత్తర చుయ్ ప్రాంతాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు ఆ దేశ మంత్రి తెలిపినట్లు మీడియా పేర్కొంది.
ఉజ్బెకిస్థాన్‌లో విద్యుత్ అంతరాయం వల్ల రాజధాని నగరం తాష్కెంట్‌లో సబ్‌వే నిలిచిపోయింది. తాష్కెంట్ విమానాశ్రయ అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. అయితే భారీ స్థాయిలో విద్యుత్ సరఫరా అంతరాయానికి కారణమేంటన్నది తెలియరాలేదు.