అసలే కరోనా. అవసరం ఉంటేనే తప్ప ఇంటి బయటకు రావొద్దని అధికారుల ఆదేశాలు. అయినా.. నిబంధనలను ఉల్లంఘించి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారు. ఓ బీచ్ దగ్గర నగ్నంగా నిల్చుని 'సన్‌బాత్' చేశారు. అయితే, అప్పటివరకు బానే ఉన్నా.. ఓ జింక వల్ల వారి పరిస్థితి దారుణంగా తయారైంది.
ఇంతకీ ఏమైందంటే..
ఆస్ట్రేలియా సిడ్నీకి దక్షిణాన ఉన్న రాయల్ నేషనల్ పార్కులో ఓ ఇద్దరు వ్యక్తులు.. తాము తప్పిపోయామని అధికారులకు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేశారు. దాంతో అధికారులు నానా తంటాలు పడి వారిని ఆ కారడవిలో ఎట్టకేలకు గుర్తించారు. అయితే.. వారిని చూశాక విస్తుపోవటం అధికారుల వంతైంది. ఆ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా ఉండటమే ఇందుకు కారణం.
జింక తరమగా..
"బీచ్‌లో సన్‌బాత్ చేస్తున్న ఆ ఇద్దరినీ.. ఓ జింక తరిమింది. దాంతో వాళ్లు భయంతో నేషనల్ పార్కులోకి పరిగెత్తారు. మళ్లీ ఎలా బయటకు రావాలో తెలియక అడవిలోనే ఉండిపోయారు." అని పోలీస్ కమిషనర్ మిక్ ఫుల్లర్ తెలిపారు. ఆ ఇద్దరిలో ఒకరికి 39 ఏళ్లు, మరొకరి 49 ఏళ్లు ఉంటాయని చెప్పారు. ఓవ్యక్తి నగ్నంగా భుజాన బ్యాగు వేసుకుని కనిపించగా.. మరో వ్యక్తి అర్ధనగ్నంగా ఉన్నాడని చెప్పారు.
సిడ్నీలోని రాయల్ నేషనల్ పార్కు రాయల్ నేషనల్ పార్కు సమీపంలోని బీచ్ అత్యవసర సేవలను పక్కన పెట్టి మరీ..
వీరిరువురిని రక్షించటానికి పోలీసు యుద్ధ విమానం, అత్యవసర సేవల విభాగం, అంబులెన్సు అధికారులు అంతా తరలివచ్చారు. వారిని రక్షించిన అనంతరం.. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను వారికి 1,000 ఆస్ట్రేలియన్ డాలర్లను జరిమానాగా విధించినట్లు అధికారులు చెప్పారు.
మైక్ ఫుల్లర్, సిడ్నీ పోలీస్ కమిషనర్ "వారిద్దరు పనిలేని వ్యక్తులు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ.. ఏ కారణం లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత నేషనల్ పార్కులో తప్పిపోయి నానా హైరానా సృష్టించారు. వీరిని రక్షించటానికి ఆరోగ్యపరమైన అత్యవసర సేవలను పక్కన పెట్టి అధికారులు తరలివచ్చారు. దీనికి వారిద్దరు సిగ్గుపడతారని అనుకుంటున్నాను."
-మిక్ ఫుల్లర్, పోలీస్ కమిషనర్.
సిడ్నీలో కరోనా కట్టడి కోసం శుక్రవారం రెండు వారాలపాటు లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచి కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను ఈ అడవిలో తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులతో కలిపి మొత్తం 44 మందికి అధికారులు జరిమానా విధించారు.
ఇదీ చూడండి:పాదాలతోనే అద్భుత చిత్రాలు.. దివ్యాంగుడి ప్రతిభ
ఇదీ చూడండి:video viral: రంగులు మారుస్తున్న వింత పాము