ప్రపంచ వ్యాప్తంగా 'హాలోవీన్' పండుగ జరిగింది. అయితే హాంకాంగ్‌లో ఈ పండుగ జరుపుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇదీ జరిగింది
ఆందోళనకారులంతా ప్రజలను మాస్కులు ధరించి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు, ఆందోళనకారులు కలిసి రకరకాల మాస్కులు ధరించి, విచిత్ర వేషధారణలతో పండుగలో మునిగి తేలారు. అయితే గతంలో ప్రభుత్వం మాస్కుల నిషేధ చట్టం అమలులోకి తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఆందోళకారులంతా కలిసి ఈ పండుగను మాస్కులు ధరించి బార్, క్లబ్, రెస్టారెంట్లు, రోడ్లపై ఎంతో ఉత్సాహంగా గడిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మాస్కుల ఆచారాన్ని కొనసాగించినందుకు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కొంత మంది నిరసనకారులపై కేసు నమోదు చేసి ఒకరిని నిర్బంధంలోకి తీసుకున్నారు.