బంగ్లాదేశ్‌కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తిరిగి భారత్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ వేడుకలు, బంగబంధు షేక్ ముజిబీర్ రెహ్మాన్ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడి చారిత్రక హిందూ దేవాలయాలను సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో మోదీ చర్చించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత విదేశీ పర్యటనకు ప్రధాని వెళ్లటం ఇదే తొలిసారి.
'తీస్తా'పై కట్టుబడి ఉన్నాం...
తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో జరిగిన భేటీలో ఆయన చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు.
"తీస్తా నదీ జలాల పంపకం ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో జరిగిన చర్చల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పెండింగ్‌లోని ఫెనీ నదీ జలాల పంపకాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని భారత్ కోరింది. ఇరు దేశాల మధ్య నదీ జలాల సహకారం కొనసాగుతుంది. "
-విదేశాంగ మంత్రి, హర్షవర్ధన్ ష్రింగ్లా