'కశ్మీర్‌పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు' జమ్ముకశ్మీర్ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ తప్పు చేశారని విమర్శించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అలాగే కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దుతో మోదీ తన చివరి అస్త్రాన్ని వినియోగించేశారని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన 'హ్యూమన్ చైన్' కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
" నరేంద్రమోదీ తప్పు చేశారు. మోదీ తన చివరి అస్త్రాన్ని వినియోగించేశారు. కానీ, కశ్మీర్ ప్రజలకు ఎలాంటి భయం లేదు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వారు ఎప్పటికీ అంగీకరించరు."
- ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధాని
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ మీడియా విస్మరిస్తోందని ఇమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాంకాంగ్ నిరసనలపైనే దృష్టి సారించిన మీడియా.. కశ్మీర్ అంశాన్ని పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీర్ ప్రజలు వ్యతిరేకిస్తారన్నారు ఇమ్రాన్. ఒక్కసారి ఆంక్షలు తొలగిస్తే కశ్మీర్ ప్రజలంతా నిరసనబాట పడతారని ట్వీట్ చేశారు.
" హాంకాంగ్ నిరసనలు హెడ్లైన్లో వేస్తున్న అంతర్జాతీయ మీడియా.. జమ్ముకశ్మీర్‌లో జరగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను వదిలేయడమేంటో నాకు అంతుచిక్కడం లేదు. వివాద భూభాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించిన ప్రాంతాన్ని 9 లక్షల మంది భద్రతా సిబ్బందితో.. కశ్మీర్ ప్రజలను నిర్బంధించి.. భారత్ అక్రమంగా ఆక్రమించింది. "
- ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధాని