Petrol price in Sri Lanka: ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోయాయి. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడటం వల్ల ఉన్న కాసిన్ని విదేశీ మారక నిల్వలను ఆదాచేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.
లీటర్ పెట్రోల్ రూ.204
రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తిన వేళ అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన చమురు ధరలు పలు దేశాల్లో ప్రభావం చూపిస్తున్నాయి. శ్రీలంకలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడి చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌కు 20 రూపాయలు, లీటరు డీజిల్‌కు 15 రూపాయలు ఒక్కసారిగా పెంచాయి. ఈ పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ 204 రూపాయలకు చేరగా.. లీటరు డీజిల్ ధర 139 రూపాయలకు ఎగబాకింది.