పంజ్‌షేర్.. ఇప్పుడు ప్రపంచ దేశాల చూపంతా ఈ అఫ్గాన్ రాష్ట్రంపైనే. పంజ్‌షేర్ తాలిబన్ల వశమైందన్న వార్తలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది(panjshir resistance). నాడు తాలిబన్లు ఎంత ప్రయత్నించినా చిక్కని కోట.. ఈసారి నెల రోజులు తిరగకుండానే కూలిపోయిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా పంజ్‌షేర్ లోయ తాలిబన్ల వశమైందా? తాలిబన్లు చూపిస్తున్న ఫొటోలు, వీడియోల్లో నిజమెంత? పంజ్‌షేర్ సింహాల పరిస్థితేంటి? అసలు పంజ్‌షేర్‌లో ఏం జరుగుతోంది?(panjshir latest news)
పంజ్‌షేర్ సామర్థ్యం అదే..!
పంజ్‌షేర్ గొప్పతనం అంతా అక్కడి లోయ కూర్పు, ప్రజల్లోనే ఉంది. వాస్తవానికి పంజ్‌షేర్ అంటే ఒక్క లోయ కాదు.. 21 లోయల సమూహం. 3వేల మీటర్ల ఎత్తైన హిందూకుష్ పర్వతాలు పంజ్‌షేర్‌కు అదనపు అందాలు, భద్రతాపరంగా ప్రకృతిచ్చిన గోడలు. పంజ్‌షేర్ రాజధాని బజారక్కు ఉత్తర కాబుల్‌కు అనుసంధానిస్తూ పర్వతాల మధ్య రోడ్డు ఉంటుంది.
పంజ్‌షేర్‌లో ఎక్కువగా తజిక్ జాతి ప్రజలుంటారు. వీరు గెరిల్లా పోరాటాలకు పెట్టింది పేరు. చడీచప్పుడు లేకుండా వచ్చి, దాడి చేసి నిమిషాల్లో పని పూర్తి చేసి వెళ్లిపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య! పర్వతాలను తమకు అనుగుణంగా ఉపయోగించుకుని దాడులు చేస్తూ ఉంటారు. క్షణాల్లోనే ఆ పర్వతాల మధ్య మాయమైపోతారు.
ఇదీ చూడండి:-Taliban panjshir: తాలిబన్లకు తలవంచని పంజ్‌షేర్!
ప్రత్యర్థులను పంజ్‌షేర్ ప్రజలు ముప్పతిప్పలు పెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నాలుగో దశాబ్దంలో అలెగ్జాండర్ నుంచి, సోవియెట్ రష్యా సమయం వరకు ఎందరో గొప్ప రాజులు, సైన్యాధికారులు పంజ్షేర్తో ఇబ్బందిపడ్డ వారే. అఫ్గాన్‌లో 1996-2001 నుంచి రాజ్యమేలిన తాలిబన్లు.. పంజ్‌షేర్‌ను ఆక్రమించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఆ కోట చెక్కుచెదరలేదు.
ఇంతటి విశిష్టలు, పోరాట యోధులకు నెలవైన పంజ్‌షేర్‌ను.. తాలిబన్లకు(taliban panjshir news) అంత సులభంగా లొంగిపోదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 6న పంజ్‌షేర్ గవర్నర్ నివాసంపై తాలిబన్లు జెండా ఎగరేసినంత మాత్రాన.. అంతా అయిపోయినట్టు కాదని అంటున్నారు.
పంజ్‌షేర్ ప్రధాన రోడ్డు వద్ద తాలిబన్లు లోయను స్వాధీనం చేసుకున్నట్టు తాలిబన్లు ప్రకటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేశారు. కానీ పంజ్‌షేర్‌లోని ప్రధాన రోడ్డు మాత్రమే వారికి చిక్కిందని, అక్కడే జెండా ఎగరేసి, ఫొటోలు దిగి ఆనందిస్తున్నారని ఆ రాష్ట్ర ఎన్ఆర్ఎఫ్ (నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్) ప్రతినిధి స్పష్టం చేశారు. దీనిపై పంజ్‌షేర్ సింహం, అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పోరాట యోధుడు అహ్మద్ షా మసూద్ సోదరుడు అహ్మద్ వాలి మసూద్ స్పందించారు.(taliban panjshir war)
"పంజ్‌షేర్ గురించి పూర్తిగా తెలిసిన వారు.. రాష్ట్రం తమకు చిక్కిందని తాలిబన్లు చేస్తున్న ప్రకటనను విశ్వసించారు. తాలిబన్లు వచ్చి ఒక్క రోడ్డును మాత్రమే చేజిక్కించుకోగలిగారు. కానీ పంజ్‌షేర్ అంటే రోడ్డు కాదు.. ఇదొక పెద్ద లోయ. అందువల్ల మాపై తాలిబన్లు పట్టుసాధించారంటే నమ్మాల్సిన అవసరం లేదు. మాకు వేలమంది ఫైటర్ల మద్దతు ఉంది. పిలిచిన వెంటనే ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా వచ్చేస్తారు. తాలిబన్ల వల్ల మాకు దెబ్బతగిలిందనేది నిజమే. కానీ మేము మరణించలేదు. బతికే ఉన్నాము. పోరాడతాము."
-- అహ్మద్ వాలి మసూద్, పంజ్‌షేర్.
పాక్ హస్తం ఉందా?
పంజ్‌షేర్‌ను తాలిబన్లు తమ వశం చేసుకునేందుకు ఓవైపు నుంచి పాకిస్థాన్(panjshir pakistan) కూడా సహాయం చేస్తోందనే వార్తలు వెలువడ్డాయి. పంజ్‌షేర్‌పై పాక్ సైన్యం 27హెలికాప్టర్లతో డ్రోన్ దాడులు చేసినట్టు ప్రచారం జరిగింది. వీటిని తాజాగా పాక్ ఖండించింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అంతర్జాతీయ సంఘం వద్ద పాకిస్థాన్ పేరును నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొంది.
ఇదీ చూడండి:-Afghanistan Hero: ఆయనంటే తాలిబన్ల వెన్నులో వణుకు..!