తెలంగాణ

telangana

ETV Bharat / international

కయ్యాలమారి మలేసియాకు మోదీ 'పామాయిల్'​ పంచ్​ - పామాయిల్ పామోలిన్

ముస్లిం ప్రపంచంలో సమున్నత స్థానాన్ని సాధించాలన్న తాపత్రయంతో భారత్​తో కయ్యానికి కాలుదువ్వారు మలేసియా ప్రధాని మహతీర్ బిన్ మహ్మద్. ఆర్టికల్-370 రద్దు సహా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్​పై అక్కసు వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో మలేసియాపై తీవ్ర అసహనంతో ఉన్న నరేంద్ర మోదీ... విదేశాంగ విధానంతోనే ఆ దేశాన్ని దెబ్బ తీయాలని నిర్ణయించుకున్నారు. భారత్​కు అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారులలో ఒకటిగా ఉన్న మలేసియాపై ప్రత్యక్ష ప్రభావం పడేలా ఆంక్షలు విధించారు. భారత్​తో పాటు పాశ్చాత్య దేశాల నుంచి మలేసియాపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న ఈ పరిస్థితుల్లో మహతీర్ ఏ దారిని ఎంచుకుంటారన్నది సందేహంగా మారింది. ముస్లిం ప్రపంచంలో ఔన్నత్యం కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెడతారా అన్నది ప్రస్తుతం సమాధానం లేని ప్రశ్న.

Palm oil is new weapon on Modi’s foreign policy arsenal?
కయ్యాలమారి మలేసియాకు మోదీ 'పామాయిల్'​ పంచ్​

By

Published : Jan 10, 2020, 3:30 PM IST

పామాయిల్, పామోలిన్​ దిగుమతులపై ఆంక్షలు విధించడం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న విదేశాంగ విధానాల్లో సరికొత్త అస్త్రంగా కనిపిస్తోంది. భారత్​ తన సొంత లక్ష్యాలను చేరుకోవడానికి... విదేశీ విధానాల్లో వ్యాపారాన్ని సాధనంగా వాడుకోవడం ఇదే తొలిసారి. దీని ద్వారా భారత అంతర్గతమైన కశ్మీర్​ వంటి అంశాలపై మలేషియా ప్రధాని మహతిర్ బిన్ మహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ పరోక్ష హెచ్చరికలు చేసినట్లయింది.

ఇండోనేసియా తర్వాత... ప్రపంచంలోని పామాయిల్ ఉత్పత్తి, ఎగుమతులలో రెండో స్థానంలో ఉన్న మలేసియాకు భారత్ విధించిన ఆంక్షలు భారీగా నష్టం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. పామాయిల్, పామోలిన్​ను భారత్​కు అత్యధికంగా ఎగుమతి చేస్తున్నది మలేసియానే కావడం గమనార్హం. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం​ విధించిన ఆంక్షలతో భారత్​​ నుంచి మలేసియా వేల కోట్ల వ్యాపారం నష్టపోయే అవకాశం ఉంది.

మరోవైపు మోదీ ప్రభుత్వ చర్యల ద్వారా భారత్​కు అతిపెద్ద ముడి పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఇండోనేసియాకు లాభం చేకూరనుందనడంలో సందేహం లేదు. కొన్నేళ్ల క్రితం, భారత్ పామాయిల్ దిగుమతుల్లో మూడింట రెండో వంతు ఇండోనేసియా నుంచే వచ్చేవి. మలేసియాలా కాకుండా ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న భారతదేశ​ వ్యవహారాల్లో ఇండోనేసియా అత్యంత తెలివిగా వ్యవహరించింది.

శుద్ధి చేసిన పామాయిల్​ దిగుమతులపై భారత్​లో పన్ను అతి తక్కువగా ఉండటం వల్ల మలేసియాకు అప్పట్లో ఎనలేని మేలు జరిగింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో మలేసియా ప్రస్తావన లేకున్నా... పామాయిల్ దిగుమతులను ఫ్రీ కేటగిరీ నుంచి రిస్ట్రిక్టెడ్ కేటగిరీ మార్చడం ఆ దేశానికి విస్పష్ట సందేశం వెళ్లినట్లే. ఇప్పటివరకు... శుద్ధి చేసిన పామాయిల్, పామోలిన్​లను ఎలాంటి ప్రత్యేక లైసెన్సులు లేకుండానే మలేసియా నుంచి దిగుమతి చేసుకోవడానికి భారత్​ అనుమతులు ఇస్తూ వచ్చింది.

మహతీర్ వర్సెస్​ మోదీ..!

మలేసియా ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచి ప్రపంచంలోని ముస్లింలందరి గళాన్ని వినిపించేలా ఎదగాలనే ఆశయంగా పెట్టుకున్నారు 94 ఏళ్ల మహతీర్ మహ్మద్​. కశ్మీర్​లో అధికరణ-370 రద్దు చేసిన సమయంలోనూ భారత్​పై తీవ్ర విమర్శలు చేశారు మహతీర్​. కశ్మీర్​పై భారత్ దండెత్తి ​దురాక్రమణ చేసిందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తాజా పౌరసత్వ సవరణ చట్టంపై కూడా మహతీర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మలేసియా ప్రధాని వ్యాఖ్యలపై మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విదేశాంగ శాఖ సైతం మహతీర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్​ను భారత్​కు అప్పగించడానికి మలేసియా విముఖత వ్యక్తం చేసింది.

మహతీర్ వచ్చినప్పటి నుంచే...

మహతీర్​ అధికారంలోకి రాకముందున్న నజీబ్ రజాక్ మలేసియా ప్రధానిగా ఉన్న సమయంలో 'లుక్ ఈస్ట్​' పాలసీపై మోదీ అత్యంత శ్రద్ధ కనబర్చారు. కానీ 2018 మేలో జరిగిన ఎన్నికల్లో మహతీర్ నేతృత్వంలోని 'పాకతాన్ హరపాన్' కూటమి గెలుపొందినప్పటి నుంచి పరిస్థితులు అపసవ్య దిశలోకి మారుతూ వస్తున్నాయి.

పదిహేనేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన మహతీర్... మలేసియా విదేశాంగ విధానాలను మార్చడానికి కంకణం కట్టుకున్నారు. ముస్లిం ప్రపంచంలో సమున్నత శిఖరాలకు చేరాలన్న ఆయన ఆశయం పాకిస్థాన్​కు చేరువయ్యేలా చేసింది. ఇది భారత్​కు రుచించలేదు.

తలొగ్గుతారా?

అయితే మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలకు మహతీర్ తలొగ్గుతారా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. తమ దేశంలోని పామాయిల్ ఉత్పత్తిదారుల క్షేమం కోరి భారత్​ విధించిన ఆర్థికపరమైన ఆంక్షల ముందు వెనకడుగు వేస్తారా అన్నది మరో ప్రశ్న. భారత్​లోని ముస్లింలకు మలేసియా మద్దతుగా మాట్లాడటం నైతికంగా భావించినా... ఆంక్షల కారణంగా ఇండోనేసియా అధికంగా లబ్ధి పొందడాన్ని చూస్తూ ఉండగలదా?

పాశ్చాత్య దేశాల ఒత్తిడి

మరోవైపు పాశ్చాత్య దేశాల నుంచి మలేసియాపై ఒత్తిడి పెరిగిపోతోంది. పామాయిల్ ఉత్పత్తిలో భాగంగా మలేసియా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, దీంతోపాటు పామాయిల్ ఉత్పత్తి ద్వారా పర్యావరణానికి తీవ్రంగా హాని కలుగుతోందని మహతీర్​పై పలు దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి.

చింతలేని భారత్​

ఆంక్షల కారణంగా దేశంలో వంట నూనెల ధరలు పెరుగుతాయనే విషయంలో భారత్​ పెద్దగా చింతించడం లేదు. దేశంలోని ఆయిల్ వ్యాపారులు సైతం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమీ లేరు. శుద్ధి చేసిన పామాయిల్​ను మలేసియా నుంచి అత్యంత చౌకకు దిగుమతి చేసుకోవడం వల్ల కుంటుపడిన వారి వ్యాపారాలు ఇప్పుడు పుంజుకుంటాయన్న ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
---------- రచయిత- శేఖర్ అయ్యర్

ABOUT THE AUTHOR

...view details