2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానం ఎఫ్-16ను తాము కూల్చివేశామని(Pak f 16 shot down) చెబుతున్న భారత్ వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. భారత వైఖరి నిరాధారమైనదని ఆరోపించింది.
అభినందన్ పోరాట పటిమకుగాను 'వీర్ చక్ర' పురస్కారంతో కేంద్రం సత్కరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన సోమవారం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్పందించిన పాక్... వర్ధమాన్ తమ విమానాన్ని కూల్చివేయలేదని ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
"2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని తమ పైలట్ కూల్చివేశాడని చెబుతున్న భారత్ వాదనను పాకిస్థాన్ ఖండిస్తోంది. ఆరోజు ఎలాంటి విమానం నేలకూలలేదని అంతర్జాతీయ నిపుణులు, అమెరికా అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. దుందుడకు చర్యలకు పాల్పడాలని చూసిన భారత పైలట్‌ను ఆరోజు పాక్ విడుదల చేయడం... శాంతి కాముక దేశంగా పాకిస్థాన్ వైఖరికి నిదర్శనం."