పాకిస్థాన్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ నేతలు, అధికారులకు కూడా వైరస్ సోకడం ఆ దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా పాక్ మాజీ ప్రధానమంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయనతో పాటు ప్రస్తుత రైల్వేమంత్రి షేక్ రషీద్ అహ్మద్ కూడా వైరస్ బారినపడ్డారు.
61ఏళ్ల అబ్బాసీకి వైరస్ నిర్ధరణ అయినట్టు పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎమ్ఎల్-ఎన్) ప్రతినిధి ధ్రువీకరించారు. రిపోర్టుల్లో పాజిటివ్‌గా తేలడం వల్ల.. అబ్బాసీ సోమవారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు స్పష్టం చేశారు.
2017 ఆగస్టు-2018 మే మధ్య కాలంలో పాక్ ప్రధానిగా విధులు నిర్వర్తించారు అబ్బాసీ.
రైల్వే మంత్రికీ...
పాకిస్థాన్ రైల్వే మంత్రికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు రషీద్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సలహా మేరకు రషీద్ రెండు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారని స్పష్టం చేసింది.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత షార్జిల్ మేమొన్, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ చట్టసభ్యుడు చౌదరి అలీ అఖ్తర్‌కు కూడా కరోనా సోకింది.
కరోనా వైరస్‌తో పాకిస్థాన్‌లో ఇప్పటివరకు నలుగురు చట్టసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. విదేశాంగ కార్యాలయంలోని ఇద్దరు అధికారులు సహా మొత్తం ఐదుగురు వైరస్ బారినపడ్డారు.
పాకిస్థాన్‌వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,671కు చేరింది. మహమ్మారి బారిన పడి ఆ దేశంలో ఇప్పటివరకు 2,067మంది మరణించారు.
ఇదీ చూడండి:-భారత్‌తో సరిహద్దు రగడపై చైనా శాంతి మంత్రం!