Pakistani Taliban ceasefire: నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)... ఇమ్రాన్ సర్కారుతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలికింది. తమ దాడులు మళ్లీ కొనసాగుతాయని ప్రకటించింది. పాకిస్థాన్ భద్రతా బలగాలు, పౌరులే లక్ష్యంగా ఈ సంస్థకు చెందిన తాలిబన్లు 14 సంవత్సరాలుగా దాడులు చేస్తున్నారు. 2014లో పెషావర్‌లోని పాఠశాలపై దాడిచేసి, 150 మంది చిన్నారులను బలి తీసుకున్నదీ వీళ్లే!
Tehreek e Taliban pakistan attacks:
అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైన క్రమంలో, తమ దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వారితో ఒప్పందానికి ప్రయత్నించారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ (ఐఈఏ) మధ్యవర్తిత్వం వహించడంతో టీటీపీ-పాకిస్థాన్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. నవంబరు 9 నుంచి నెల రోజులపాటు కాల్పులను విరమించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. అయితే, జైల్లో మగ్గుతున్న తమ సంస్థకు చెందిన 120 మంది ముజాహిదీన్లను ఐఈఏ ద్వారా విడిచిపెట్టాలని టీటీపీ ప్రధాన షరతు విధించింది. ఇందుకు ఇమ్రాన్ ప్రభుత్వం అంగీకరించింది.