అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని 'గ్రే' లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిర్ణయించింది. నిర్దేశించిన 34 విధుల్లో 30 విధులను మాత్రమే నిర్వర్తించినందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్చవల్‌గా నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ తెలిపారు.
పాకిస్థాన్ ఇప్పటివరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా కీలకమైన చర్యలు చేపట్టిందని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. అయితే.. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు హఫీజ్ సాయిద్, మసూద్ అజర్ సహా వారి బృందాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను పాక్ మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏటీఎఫ్ పేర్కొంది.