కరోనా కారణంగా ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. వ్యాపారాలన్నీ దివాలా తీశాయి. ఈ క్రమంలో తక్కువ లాభం వచ్చినా.. వస్తువులు అమ్ముడు పోవాలని చిరు వ్యాపారులు ఆలోచిస్తుంటారు. అందులో భాగంగా ధరలను తగ్గించి అమ్ముతుంటారు. అయితే పాకిస్థాన్లో ఓ వ్యాపారి ఇలా చేయడమే తప్పు అయ్యింది. ఇలా చేసినందుకు అతడిని అరెస్టు చేశారు పోలీసులు.
లాహోర్లో వక్వాస్ అనే వ్యక్తి.. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. నగరంలో నిర్ణయించిన ధరకే కూరగాయలు విక్రయించాలనే నిబంధనను తీసుకువచ్చింది అక్కడి అధికార యంత్రాంగం. కానీ వక్వాస్ మాత్రం అంతకన్నా తక్కువ ధరకు అమ్మాడు. కిలో టమాట మార్కెట్ ధర రూ.50 ఉండగా.. 25కే విక్రయించాడు. ఉల్లిగడ్డ మార్కెట్ ధర రూ.40 ఉండగా.. రూ.33కే విక్రయించాడు. దీంతో ధరల నియంత్రణ అధికారులు.. వక్వాస్ను అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 15న వక్వాస్ అరెస్టు అయ్యాడు. మరుసటి రోజు బెయిల్పై విడుదలయ్యాడు.