కొవిడ్-19 నివారణకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్ తయారుచేసిన టీకా పనితీరు అంతంతమాత్రమేనని వెల్లడైంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. డ్రాగన్‌కు అత్యంత సన్నిహిత దేశమైన పాకిస్థాన్. 60 ఏళ్లు పైబడినవారిపై సినోఫార్మ్ టీకా సమర్థంగా పనిచేయడం లేదని తెలిపింది. పాక్‌కు 5 లక్షల సినోఫార్మ్ టీకాలను చైనా విరాళంగా ఇచ్చింది. సోమవారం వాటిని చేరవేసింది.
ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రాథమిక డేటాను పాక్ నిపుణుల కమిటీ విశ్లేషించింది. వాటి ఆధారంగా ఈ టీకాను 18-60 ఏళ్లు వయసు వారికే సిఫార్సు చేసింది. ప్రధాన మంత్రికి సలహాదారు ఫైజల్ సుల్తాన్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. 60 ఏళ్లు పైబడ్డ వారికి ఈ వ్యాక్సిన్‌ను వేయవద్దని కమిటీ సూచించినట్లు తెలిపారు. టీకా సామర్థ్యంపై మరింత డేటా అందుబాటులోకి వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.