పాకిస్థాన్‌లో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. మంగళవారం 2,255 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 34 వేలకు చేరింది. మరో 31 మంది వైరస్‌కు బలయ్యారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 737 మరణాలు సంభవించాయి.
పాక్‌లో అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో 13,225 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ నుంచి ఇప్పటివరకు 8,812 మంది కోలుకోగా.. 3,17,699 మందికి పరీక్షలు నిర్వహించినట్ల అధికారులు తెలిపారు.
విదేశాల నుంచి వచ్చిన వారితో..
విదేశాల నుంచి తిరిగి రప్పించిన వారిలోనూ ఈ వైరస్ ప్రబలడం పాక్‌ను కలవరపెడుతోంది. ఇటీవల 24 ప్రత్యేక విమానాల్లో వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన వారిలో 379మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది.
ఏప్రిల్ 14 నుంచి మే 10 వరకు 43 విమానాలలో మొత్తం 7,756 మంది పాకిస్థానీయులు విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. వారిలో 682 మంది ప్రయాణికులకు వైరస్ నిర్ధరణ కాగా.. పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు.
కోలుకుంటున్న గవర్నర్
కరోనా బారిన పడ్డ సింధ్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్.. ప్రస్తుతం కోలుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.