తెలంగాణ

telangana

ETV Bharat / international

'గప్​చుప్​గా​ ఉగ్ర జాబితా నుంచి వేల మంది తొలగింపు' - ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ

పాక్​ మరో సారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. సుమారు 1,800మందిని ఉగ్ర జాబితా నుంచి తొలగించింది. ఇందులో 2008 ముంబయి పేళ్లు సూత్రధారి కూడా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఓ అంకుర సంస్థ నివేదించింది. ఈ ఏడాది జూన్​లో ఎఫ్​టీఎఫ్​ సమావేశం జరగనున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Pakistan removes thousands of names from terrorist watch list: Report
వేలమంది

By

Published : Apr 21, 2020, 4:17 PM IST

పాకిస్థాన్‌ మరోసారి తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంది. ఓవైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారిని ఓడించేందుకు తిరుగులేని పోరాటం చేస్తుంటే.. పాక్‌ మాత్రం అదేదో అత్యవసర కార్యమన్నట్లు నిషేధిత ఉగ్రవాదుల జాబితాను సవరించింది. 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి ఎల్​ఈటీ ఆపరేషన్స్​ కమాండర్​ జాకీ-ఉర్​-రెహ్మాన్​ లఖ్వీతో సహా 1,800 మందిని తమ ఉగ్ర జాబితా నుంచి తొలగించింది పాక్​. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ అంకుర సంస్థ నివేదించింది.

న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న క్యాస్టెల్లమ్‌.ఏఐ అనే టెక్నాలజీ కంపెనీ ప్రకారం.. 2018లో నిషేధిత జాబితాలో 7,600గా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య.. ఇప్పుడు 3,800కి చేరింది. గత మార్చి నుంచి ఏకంగా 1,800 మందిని ఈ జాబితా నుంచి తొలగించినట్లు క్యాస్టెల్లమ్‌ గుర్తించింది.

ఎందుకు ఇదంతా?

పాకిస్థాన్‌ను ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)'గ్రే' జాబితాలో చేర్చింది. అయితే, ఈ విషయంపై జూన్‌లో మరోసారి సమీక్ష జరపనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌లిస్ట్‌ ముప్పు తప్పించుకునేందుకే పాక్‌ ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏఫ్‌టీఎఫ్‌ సిఫార్సుల్ని సమర్థంగా అమలు చేస్తున్నామని నమ్మబలికించడానికే ఈ కార్యానికి శ్రీకారం చుట్టినట్లు అర్థమవుతోంది. నిషేధిత ఉగ్రవాదుల్ని తొలగించినపుడు ఆ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ, వాటిని పాక్‌ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. ఈ మేరకు ప్రముఖ అమెరికన్‌ దినపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. తొలగించిన తీరు, వేగం పలు అనుమానాలకు తావిస్తోందని నిపుణులు అభిప్రాయపడటం గమనార్హం.

లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం...

పాక్‌ను 'గ్రే లిస్ట్‌'లో కొనసాగిస్తూ ఎఫ్‌ఏటీఎఫ్‌ ఇప్పటి వరకు రెండుసార్లు నిర్ణయం తీసుకుంది. నిధుల కట్టడి దిశగా కఠిన చర్యలు తీసుకునేందుకు పాక్‌కు గత అక్టోబర్‌లోనే అవకాశం కల్పించింది. కంటితుడుపు చర్యలతో సరిపెట్టాలని చూసిన దాయాది దేశ దుర్బుద్ధిని పసిగట్టిన ఎఫ్‌ఏటీఎఫ్‌ 'గ్రే లిస్ట్‌' నుంచి తప్పించకుండా గట్టి హెచ్చరికే జారీ చేసింది. అక్టోబర్‌ 2018లో తొలిసారి పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది‌. 15 నెలల సమయం ఇచ్చినప్పటికీ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో దాయాది విఫలమైంది.

ఆ పని చేయాల్సింది పోయి...

తాజాగా నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ఇమ్రాన్‌ ప్రభుత్వం.. ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. కానీ, వీటిని అమలుచేయడంలో పాక్‌ ఇప్పటి వరకు పెద్దగా పురోగతి సాధించినట్లు మాత్రం సూచనలు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాలు, ఆపై గ్రే లిస్ట్‌ కత్తి, ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు కరోనా మహమ్మారి.. వీటి నుంచి ఎలా బయటపడాలో పాలుపోని పాక్‌.. ఎలాగైన బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పించుకునేందుకు ఇలాంటి వక్రమార్గాలను ఎంచుకుంటున్నట్లు అర్థమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details