తెలంగాణ

telangana

ETV Bharat / international

'కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసులో అది సాధ్యం కాదు' - కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసులో పాక్ విజ్ఞప్తి కుదరదు అన్న పాక్​​

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ యాదవ్‌ తరపున వాదించేందుకు భారతీయ న్యాయవాదిని అనుమతించాలన్న ఇండియా డిమాండు ఆచరణలో సాధ్యం కాదని పాక్ వెల్లడించింది. పాకిస్థాన్‌కు చెందని న్యాయవాదిని యాదవ్‌ తరపున వాదించేందుకు అంగీకరించాలంటూ భారత్‌ కోరిందని పాక్​ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్‌ చౌదరి తెలిపారు.

Pakistan rejects Indias demand again in Kulbhushan Jadhav cse
కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసులో అది సాధ్యం కాదు

By

Published : Sep 19, 2020, 12:44 PM IST

Updated : Sep 20, 2020, 9:12 AM IST

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసుకు సంబంధించి భారత్‌ విజ్ఞప్తిని ఆ దేశం మరోసారి తిరస్కరించింది. యాదవ్‌ తరపున వాదించేందుకు భారతీయ న్యాయవాదిని లేదా క్వీన్‌ కౌన్సిల్‌ను అనుమతించాలన్న భారత్‌ డిమాండు ఆచరణలో సాధ్యం కాదని ఆ దేశం చెబుతోంది. పాకిస్థాన్‌కు చెందని న్యాయవాదిని యాదవ్‌ తరపున వాదించేందుకు అంగీకరించాలంటూ భారత్‌ కోరుతోందని పాక్‌ అధికార ప్రతినిధి జహీద్‌ హఫీజ్‌ చౌదరి మీడియా సమావేశంలో వెల్లడించారు.

"కేవలం పాకిస్తాన్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు అధికారిక అనుమతి ఉన్న న్యాయవాదులే ఈ దేశ న్యాయస్థానాల్లో వాదించగలరని భారత్‌కు తెలియచేశాము. ఈ విధానం ప్రపంచ వ్యాప్తంగా అన్ని న్యాయవేదికలపై అమల్లో ఉన్నదే. మా నిర్ణయం మార్చుకునే అవకాశం లేదు."అని ఆయన ప్రకటించారు.

పాక్‌ ఏజెంట్లు 2016లో కుల్‌భూషణ్‌ యాదవ్‌ను ఇరాన్‌ నుంచి అపహరించారు. గూఢచర్యం నిర్వహించారనే ఆరోపణపై పాక్‌ మిలటరీ న్యాయస్థానం 2017లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భారత్‌ అదే సంవత్సరంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించింది. ఈ కేసులో సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ఐసీజే సమక్షంలో భారత్‌ తరపున వాదించారు.

ఐసీజే మార్గదర్శకాల అనుసారం తప్పనిసరి పరిస్థితిలో.. జాదవ్‌ కేసులో న్యాయవాదిని నియమించేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాల్సిందిగా ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. అందుకు వీలుగా ఈ కేసు విచారణను ఒక నెలరోజుల పాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పాక్‌ తాజా నిర్ణయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ స్పందించారు. ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరిపేందుకు, అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) సూచనలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పాక్‌ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన విమర్శించారు.

Last Updated : Sep 20, 2020, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details