అఫ్గానిస్థాన్‌కు సహాయంగా భారత్ ప్రకటించిన 50వేల మెట్రిక్ టన్నుల (India Afghanistan News) గోధుమలను పాకిస్థాన్ మీదుగా తరలించేందుకు ఇటీవలే అంగీకరించిన పాక్ ప్రభుత్వం.. తాజాగా కొన్ని షరతులను విధించింది. గోధుమలతో పాటు.. ఔషధాల సరఫరాకు సంబంధించి రవాణా సౌకర్యాన్ని అందించే విధానాలపై జరిగిన చర్చల్లో కొన్ని షరతులు విధించింది. అయితే మానవతా సహాయం వంటి సున్నితమైన అంశాల్లో షరతులు విధించడం ఏంటని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశ్నిస్తోంది. 'గోధుమల తరలింపునకు ఎలాంటి షరతులు విధించకుండా అఫ్గాన్ ప్రజల మేలు కోసం రవాణా సౌకర్యానికి అనుమతించాలని స్పష్టం చేసింది భారత్. కానీ.. పాక్ పలు రకాలుగా అడ్డుకుంటోందని' అధికారులు తెలిపారు.
'లబ్ధిదారులకు చేర్చేందుకే మా తాపత్రయం..'
అఫ్గానిస్థాన్‌కు 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీటిని వాఘా (India Afghanistan News) సరిహద్దు మీదుగా తరలించేందుకు అనుమతించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. దీనికి పాక్ పచ్చజెండా ఊపింది. అయితే వాఘా సరిహద్దు నుంచి పాక్ ట్రక్కుల్లో రవాణా చేసేలా నిబంధనలను రూపొందించింది. దీనిని వ్యతిరేకించిన భారత్.. తన సొంత వాహనాల్లోనే తరలించాలని స్పష్టం చేస్తోంది. 'తాము అందిస్తున్న సహాయం దారి మళ్లకుండా.. లబ్ధిదారులకు చేరేలా చూసే బాధ్యత తమకుందని' భారత్ తన చర్యను సమర్థించుకుంటోంది. చివరకు పాకిస్థాన్‌లోని ఐరాస ట్రక్కుల్లో గోధుమలను రవాణా చేయాలని అక్కడి అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇప్పటికే అఫ్గాన్‌కు చేరవేసేందుకు భారత్ తన సహాయాన్ని వాఘా సరిహద్దు వద్దకు తరలించింది కూడా.
'పాక్ మీదుగా అఫ్గాన్‌కు మానవతా సహాయాన్ని పంపే అంశంపై ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయని' విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. అయితే మానవతా థృక్పథంతో చేస్తున్న సహాయానికి షరతులు విధించడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: