పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో శనివారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తిరుగుబాటుదారులను అనర్హులుగా ప్రకటిస్తామని అధికార తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తన విజయంపై నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని విశ్వాస పరీక్షపై శనివారం సమావేశం జరగనుందని జాతీయ అసెంబ్లీ సచివాలయం తెలిపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ప్రవేశ పెట్టనున్న విశ్వాస తీర్మానంపై సభ్యులు ఓటు వేయనున్నారు. అయితే.. ఈ ఓటింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష పాకిస్థాన్ డెమెక్రటిక్ మూవ్మెంట్(పీడీఎం) శుక్రవారం తెలిపింది. దాంతో ప్రతిపక్ష పార్టీ లేకుండానే విశ్వాస పరీక్ష జరగనుంది.