ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌పై పోరులో నిమగ్నమై ఉంటే.. పాకిస్థాన్ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా దుష్ట పన్నాగాలను పన్నుతోంది. తాజాగా తన క్షిపణి వ్యవస్థను మన దేశ సరిహద్దులకు చేరువగా తీసుకొచ్చింది. ప్రపంచం దృష్టిని మళ్లించడమే దీని ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పాక్ తన ఎల్‌వై-80 క్షిపణి వ్యవస్థను లాహోర్ నగర శివార్లలో మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. భారత్-పాక్ సరిహద్దులకు ఇది కేవలం 22.53 కిలోమీటర్ల దూరంలోనే ఉందని సీనియర్ సైనికాధికారి ఒకరు ఈటీవీ భారత్’కు తెలిపారు. రెండు దేశాలూ కొవిడ్-19పై పోరులో నిమగ్నమైన తరుణంలో పాక్ ఈ చర్యను చేపట్టడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు, చొరబాటు యత్నాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.