Pakistan Missile Retaliation: భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఒక క్షిపణి పొరబాటుగా పాకిస్థాన్ భూభాగంలో పడిన ఘటన ఇరు దేశాల మధ్య వివాదాలకు తెరలేపింది. ఈ క్రమంలో సింధ్ జంషోర్ ప్రాంతంలో పాక్ ప్రయోగించిన ఓ మిసైల్ విఫలమైనట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆకాశంలో ఓ గుర్తుతెలియని రాకెట్ లేదా మిసైల్ వంటి వస్తువును గమనించినట్లు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయి.
నిజానికి ఈ ప్రయోగం గురువారం ఉదయం 11 గంటలకే జరగాల్సి ఉంది. అయితే.. సాంకేతిక కారణాల వల్ల ఒక గంట ఆలస్యం అయింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రయోగించిన సెకన్లలోనే నింగిలోకి ఎగిరి.. పొగలు గక్కుతూ కిందికి పడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వచ్చాయి.
అయితే.. క్షిపణి ప్రయోగం విఫలమైందన్న వార్తల్ని స్థానిక అధికారిక వర్గాలు ఖండించాయి. అది మిసైల్ కాదని, సైన్యం ప్రయోగించే సాధారణ మోర్టార్ అని తెలిపాయి. అయితే.. గరిష్ఠంగా 5 కి.మీ పరిధి ఉన్న మోర్టార్‌కు ఆ స్థాయిలో ట్రేసర్ ప్రొజక్టైల్ ఉండే అవకాశం లేదు.