పాక్‌లోని కరాచీ విమానాశ్రయంలో నిమిషం వ్యవధిలో ల్యాండ్ అవ్వాల్సిన లోహవిహంగం ఎయిర్‌బస్ ఏ-320 అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 97 మంది మరణించారు. ఇందులో 9 మంది చిన్నారులు ఉన్నారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదం అనంతరం స్పందించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) అధికారులు విమానం పూర్తి కండిషన్లోనే ఉన్నట్లు వెల్లడించారని అక్కడి అధికారిక మీడియా డాన్ పేర్కొంది.
రెండు నెలలుగా చెకింగ్ లేదు..!
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్డౌన్ కారణంగా విమాన సేవలు నిలిచిపోయాయి. అయితే ఈ సమయంలో ఆగిపోయిన విమానం.. తాజాగా సర్వీసులు ప్రారంభించినా ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విమాన పనితీరును రెండు నెలలుగా పరీక్షించలేదని.. ప్రమాదం జరిగిన ముందురోజే అత్యవసరంగా మస్కట్ నుంచి లాహోర్‌కు దీన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
అన్నీ బాగానే ఉన్నాయి: పీఐఏ
ప్రమాదంపై ప్రాథమిక నివేదిక విడుదల చేసిన పీఐఏ... విమానంలో సాంకేతిక సమస్యలు లేవని స్పష్టం చేసింది. ఇంజిన్, గేర్, ఎయిర్‌సిస్టమ్ పనితీరు బాగానే ఉన్నట్లు వెల్లడించింది. మార్చి 21న చివరగా విమానాన్ని పరీక్షించారని పేర్కొంది. పైలట్ల వైద్య నివేదికలు బట్టి ప్రయాణానికి ముందు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని పీఐఏ తెలిపింది.
ఈ ఏడాది నవంబర్ 5 వరకు విమానానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆ దేశ పౌర విమానయాన శాఖ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని ప్రస్తావించింది. కూలిపోయిన ఈ ఎయిర్‌బస్‌కు 2014, నవంబర్ 6 నుంచి 2015, నవంబర్ 5 వరకు తొలిసారి అనుమతి ఇచ్చారని... విమానం ప్రతి ఏడాది పూర్తిగా చెక్ చేశాకే సంవత్సర కాలానికి అనుమతి ఇస్తారని పీఐఏ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
స్వతంత్ర విచారణ కోసం...
ఈ ఘటనపై విచారణ బాధ్యతలను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ప్రెసిడెంట్(పీఏఏఐబీ)మహ్మద్ ఉస్మాన్ ఘనీకి అప్పజెప్పింది ప్రభుత్వం. నెలరోజుల్లో ప్రాథమిక విచారణకు సంబంధించిన నివేదిక అందించాలని సూచించింది. అయితే అంతర్జాతీయ సంస్థలతో వేగంగా విచారణ జరిపించాలని కోరింది పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్(పీఏఎల్‌పీఏ). ఈ విచారణలో గ్రౌండ్, విమాన సిబ్బందినీ ఆరా తీయాలని సూచించింది.
ప్రత్యక్ష సాక్షుల మాట ఇలా...
విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు 2 సార్లు ప్రయత్నించినా విఫలమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని డాన్ పత్రిక పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో చక్రాలు బయటకు రాలేదని అప్పుడు విమానం అడుగుభాగం భవనాలకు తాకినట్లు అందులో రాసుకొచ్చింది. ఇంజిన్ నుంచి మంటలు రావడం గమనించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారని తెలిపింది.
ల్యాండింగ్‌లో ఇబ్బందులు!
విమాన చక్రాల వ్యవస్థ (ల్యాండింగ్ గేర్)కు సంబంధించి సమస్యలు ఉన్నట్లు పీకే-8303 పైలట్ కెప్టెన్ సజ్జాద్ గుల్ మధ్యాహ్నం 2.37 గంటలకు విమాన రద్దీ నియంత్రణ వ్యవస్థ (ఏటీసీ)కు తెలిపినట్లు పీఐఏ అధికారి ఒకరు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ లోహ విహంగం.. రాడార్ తెరపై నుంచి అదృశ్యమైందన్నారు.
మరోవైపు పైలట్‌కు కరాచీ ఏటీసీకి మధ్య జరిగిన చిట్టచివరి సంభాషణను సంపాదించినట్లు పాక్ వార్తా ఛానల్ ఒకటి పేర్కొంది. దీని ప్రకారం.. విమానంలోని రెండు ఇంజిన్లు విఫలమైనట్లు పైలట్ తెలిపారు. ఆ తర్వాత కొద్ది సెకన్లకు పైలట్ 'మేడే.. మేడే.. మేడే..'(ప్రమాద సంకేతం) అని అరిచారు. అనంతరం విమానం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు.
మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు
విమానం జిన్నా హౌసింగ్ సొసైటీపై కూలి పోయింది. ఈ ఘటనలో గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తోన్నట్లు పాక్ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది సాధారణ ప్రజలు చనిపోయారని దాదాపు 25-30 మంది గాయపడినట్లు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు ఐదుగురి శవాలు మాత్రమే లభ్యమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఎక్కువ మృతదేహాలు కాలిపోయి ముద్ద అయిపోవడం వల్ల గుర్తుపట్టలేకపోతున్నామని.. వాటికి డీఎన్ఏ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు సంబంధించిన బంధువులు కరాచీ యూనివర్సిటీ ఫోరెన్సిక్ డీఎన్ఏ లాబోరేటరీలో తగిన వివరాలు ఇచ్చి మృతదేహాలను గుర్తించవచ్చని సూచించారు.