ప్రపంచదేశాలకు పెను సవాల్‌గా మారిన కొవిడ్-19.. పాక్ ఉగ్రవాదులకు వరంలా మారింది. ఖైదీలకు వైరస్ ముప్పు పొంచిఉందనే కారణంగా ఇప్పటికే లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ సహా అనేక మంది ఉగ్రవాదులకు విముక్తి కల్పించింది. లాహోర్‌లో ఉన్న 50 మంది ఖైదీలకు వైరస్ సోకిందని ఆ రాష్ట్ర సీఎం తెలిపారు. ఈ సాకుతో ప్రమాదకర ఉగ్రవాదులందరికీ దేశంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు.
పాక్ బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పాలంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించాలని ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్) గట్టిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల్లో అక్కడి ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది. పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్ట్ జాబితాలో చేర్చాలా? వద్దా.? అనే అంశంపై వచ్చే నెలలో ఎఫ్‌ఏటీఎఫ్ సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సుమారు 1000 మంది ముష్కరుల్ని అధికారిక జాబితా నుంచి పాక్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తొలగించింది.