పాకిస్థాన్‌లోని తొలి హిందూ ఆలయానికి శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే.. నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రాజధాని ఇస్లామాబాద్‌లో తలపెట్టిన ఈ ఆలయానికి సంబంధించిన ప్రణాళికలకు ఆమోదం లభించకపోవడమే ఇందుకు కారణమని డాన్ పత్రిక వార్త ప్రచురించింది.
కృష్ణుడి ఆలయం.. ఇస్లామాబాద్‌లోని హెచ్-9 పరిపాలన విభాగంలోకి వస్తుంది. ఆలయాన్ని 20వేల చదరపు అడుగుల విస్తీరణంలో నిర్మించాలనుకున్నారు. అయితే సరిహద్దు గోడ నిర్మాణాన్ని శుక్రవారం నిలిపివేసింది రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఇందుకు చట్టపరమైన కారణాలున్నాయని వెల్లడించింది.
భవన నియంత్రణ విభాగం(బీసీఎస్) అధికారులు శుక్రవారం ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆలయ నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను చూపించాలని.. ఆ తర్వాత దానికి ఆమోదం లభిస్తేనే ముందుకు సాగాలని తెలిపారు.
అయితే.. ఆలయ శంకుస్థాపన వేడుకలో పాల్గొన్న పాకిస్థాన్ మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హి మాత్రం.. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను పంచాయత్.. ఇప్పటికే మతవ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నివేదికనే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చూపించి ఆలయ నిర్మాణానికి 100 మిలియన్ రూపాయలు విడుదల చేయాలని మతవ్యవహారాల మంత్రి పీర్ నూరుల్ హక్ అభ్యర్థించినట్టు వివరించారు.
ఇదీ చూడండి:-చైనాను కట్ చేయకపోతే ఇక పాక్ పని అంతే!