అఫ్గానిస్థాన్ పొరుగు దేశాల ప్రతినిధులతో పాకిస్థాన్ ఉమ్మడి సమావేశం నిర్వహించింది. అఫ్గాన్‌లో తాజా పరిస్థితిపై చర్చించినట్లు ప్రకటించింది. అప్గాన్‌లో పాకిస్థాన్ ప్రత్యేక ప్రతినిధి మొహమ్మద్ సాదిక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. చైనా, ఇరాన్, తజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి గత నెలలో ఇరాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్‌లలో పర్యటించిన కొన్ని రోజులకే ఈ సమావేశం జరగడం గమనార్హం.
సుదీర్ఘ యుద్ధంతో దెబ్బతిన్న అఫ్గాన్‌లో శాంతిభద్రతలతో పాటు స్థిరత్వం కీలకమని చైనా, ఇరాన్, తజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సవాళ్ల పరిష్కారం కోసం కృషితో పాటు.. ప్రాంతీయ విధాన ఆవశ్యకతను ఉద్ఘాటించారు.
ఐరాసతో తాలిబన్ల సమావేశం..!
దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో ప్రజలకు మానవతా కోణంలో సహాయం చేయాల్సిందిగా తాలిబన్లు ఐరాసను కోరారు. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వంలో(afghan taliban) కీలక స్థానాన్ని దక్కించుకోనున్న ముల్లా బరాదర్ ఐరాస మానవతా వ్యవహారాల బాధ్యుడు మార్టిన్ గ్రిఫిత్స్‌తో సమావేశమయ్యారు. కాబుల్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అఫ్గాన్‌కు ఐరాస మద్దతు, సహకారం కొనసాగుతాయని ఐరాస హామీ ఇచ్చినట్లు టోలో న్యూస్ వెల్లడించింది. ఈ సమావేశం తాలూకు ఫొటోలను తాలిబన్ ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ ట్వీట్ చేశారు.
"సంక్షోభం సమయంలో లక్షలాది మందికి నిష్పాక్షిక మానవతా సహాయం, రక్షణను అందించేందుకు ఐరాస నిబద్ధతను కలిగి ఉందని చాటేందుకు తాలిబాన్ నాయకత్వాన్ని కలిశాను" అని మార్టిన్ గ్రిఫిత్స్ ట్వీట్ చేశారు.
మరో సంక్షోభం తప్పదా?..