కశ్మీర్ అంశంపై సౌదీ అరేబియాతో సహా ఇతర ముస్లిం దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించి భంగపడింది పాకిస్థాన్. దీంతో సౌదీపై తీవ్ర విమర్శలు చేసి ఆ దేశం ఆగ్రహానికి గురైంది. ఈ పరిణామంతో పాక్-సౌదీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అసలే కష్టాల్లో ఉన్న పాక్‌కు, సౌదీ మద్దతు ఉపసంహరణ పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వా ఆదివారం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఈ పర్యటన ద్వారా సౌదీతో చర్చలు జరిపి పరిస్థితులు చక్కదిద్దాలని పాక్ భావిస్తోందని సమాచారం.
అసలేం జరిగింది..
కశ్మీర్ అంశంపై తమకు మద్దతుగా మాట్లాడాలని సౌదీ అరేబియాను పాకిస్థాన్ పదే పదే కోరింది. ఈ విషయంలో తనకంటూ సొంత వైఖరి కలిగిన సౌదీకి ఈ విషయం అంతగా నచ్చలేదు. అలానే ఇదే విషయమై ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించి పాక్ భంగపడింది. దీంతో సౌదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయం సౌదీ రాజు సాల్మాన్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో పాక్‌కు సౌదీ చమురు సరఫరా నిలిపివేసింది. అలానే సౌదీ నుంచి అప్పుగా తీసుకొన్న 3 బిలియన్ అమెరికా డాలర్లలో ఒక బిలియన్‌ను గతవారం పాక్ తిరిగి చెల్లించింది. అయితే సౌదీ ఒత్తిడి మేరకే ఈ చెల్లింపు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉండటతో పరిస్థితుల్ని చక్కదిద్దేంకు పాక్ ఆర్మీ చీఫ్ సౌదీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: సౌదీ- పాక్ మైత్రికి బీటలు..కశ్మీర్ అంశమే కారణం!