పారిస్‌లో జరిగిన యునెస్కో(యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) సమావేశంలో పాకిస్థాన్ వక్ర ప్రచారాలకు గట్టి జవాబు చెప్పింది భారత్. దిల్లీకి ప్రాతినిధ్యం వహించిన అనన్యా అగర్వాల్ పాక్‌ను తీవ్రస్థాయిలో తూర్పూరబట్టారు. ఆ దేశ లోతుల్లో ఉగ్రవాద డీఎన్ఏ నాటుకుని ఉందని, అందుకే జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో కల్లోలాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై అనవసరంగా స్పందించిన పాక్, అసత్య ప్రచారం చేస్తోందని అనన్య మండిపడ్డారు.
"పాక్‌లో 1947లో 23 శాతం ఉన్న మైనారిటీల జనాభా ఇప్పుడు 3 శాతానికి తగ్గిపోయింది. ఆ దేశంలో లింగ వివక్ష కూడా ఉంది. బాల్యవివాహాలు, బలవంతపు వివాహాలు, పరువు హత్యలు, మత మార్పిడి చేయనివారిపై యాసిడ్ దాడులు పాక్‌లో రగులుతున్న సమస్యలు. వీటన్నింటినీ వదిలేసి పాక్ భారత్ విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏంటి" అని ప్రశ్నించారు అనన్య.
పాకిస్థాన్ నరనరాన ఉగ్రవాద డీఎన్ఏ: భారత్ "జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌పై పాక్ చేసిన అసత్య, అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఆ దేశం మైనారిటీల పట్ల వివక్ష చూపుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఇలా పాక్ దయనీయమైన స్థితిని కప్పిపుచ్చేందుకే భారత్‌పై అసత్య కథనాలు అల్లుతోంది. అది ఎలాంటి దేశమంటే... అణుయుద్ధాన్ని ప్రేరేపించేందుకు ఆ దేశ నాయకులు ఐరాస వేదికనే తమకు అనుగుణంగా మలుచుకుంటారు. పాక్ ప్రవర్తన ఆ దేశ స్థాయిని దిగజారుస్తోంది. ఆర్థిక సంక్షోభం, అతివాద సిద్ధాంతాలు నిండి ఉన్న పాక్ లోతుల్లో ఉగ్రవాద డీఎన్ఏ ఉంది."
-అనన్యా అగర్వాల్, భారత ప్రతినిధి
పాకిస్థాన్ అన్ని చీకటికోణాలకు గూడు అన్నారు అనన్య. పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఇటీవలె ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులు, హకానీ వ్యవస్థలను హీరోలుగా వర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు.
ఇదీ చదవండి:'ఐరాసలో అత్యవసరంగా సంస్కరణలు చేపట్టాలి'