జమ్ముకశ్మీర్ స్థానిక ఎన్నికల్లో అలజడులు సృష్టించేందుకు జైషే మహమ్మద్ ప్రణాళికలు రచిస్తోందన్న భారత్ ఆరోపణలను పాకిస్థాన్ తిరస్కరించింది. ఈ మేరకు నగ్రోటా ఘటనపై భారత హైకమిషన్‌కు సమన్లు జారీ చేసి.. భారత వ్యాఖ్యలను ఖండించింది.
ఉగ్రవాదులకు సహకరించడం మానుకోవాలని పాకిస్థాన్ హైకమిషన్‌కు భారత్ తేల్చిచెప్పిన కొద్ది గంటల వ్యవధిలో ఆ దేశం ఈ విధంగా స్పందించింది.
మరోవైపు ఇదే విషయంపై పాకిస్థాన్ విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. నగ్రోటా ఘటనతో పాకిస్థాన్‌కు సంబంధం లేదని.. తప్పుడు లెక్కలు వేసుకునే అలవాటును భారత్ మానుకోవాలని పేర్కొంది.
జమ్ముకశ్మీర్ నగ్రోటాలో.. గురువారం ఉదయం నలుగురు జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాదులను భారత భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా దళాల అప్రమత్తత వల్ల భారీ ఉగ్రకుట్ర భగ్నమైందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-'ఇలా అయితే మేం పాకిస్థాన్ నుంచి వెళ్లిపోతాం!'