తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉగ్రవాదులపై పాక్ కొరడా- 88 సంస్థలపై కఠిన ఆంక్షలు - ఉగ్రవాదం

కరడుగట్టిన ఉగ్రవాదులపై పాకిస్థాన్ చర్యలు చేపట్టింది. 88 నిషేధిత ఉగ్ర సంస్థలు, వాటి అధిపతులపై ఆంక్షలు విధించింది. ఎఫ్​ఏటీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆంక్షలు విధించిన ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీం వంటి పలువురు ఉగ్రముఠాల నాయకులున్నారు.

Pak puts more curbs on Hafiz Saeed, Masood Azhar and Dawood Ibrahim to avoid FATF blacklisting
ఉగ్రవాదులపై పాక్ కొరడా- 88 సంస్థలపై కఠిన ఆంక్షలు

By

Published : Aug 22, 2020, 5:20 PM IST

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్​ ఫోర్స్ విధించిన​ 'గ్రే' లిస్ట్​ జాబితా నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ చర్యలు చేపట్టింది. 88 నిషేధిత ఉగ్ర సంస్థలు, అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో పేరుమోసిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్​, దావూద్ ఇబ్రహీం పేర్లు సైతం ఉన్నాయి.

ఈ ఉగ్రవాదుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 18న ఇమ్రాన్ ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లను విడుదల చేసినట్లు తెలిపింది.

"ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాజాగా విడుదల చేసిన జాబితాకు అనుగుణంగా 88 మంది ఉగ్రవాద సంస్థలు, నాయకులపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. వీరందరి స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకోవాలని, బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆర్థిక సంస్థల ద్వారా నగదు బదిలీ చేయడం, ఆయుధాలు కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణాలు వంటివి చేయకుండా ఈ ఉగ్రవాదులపై నిషేధం విధించింది."

-ది న్యూస్, పాకిస్థాన్ దినపత్రిక

జమాత్ ఉద్​ దవా, జైషే మహమ్మద్, తాలిబన్, ఐఎస్​ఐ(డాయిష్), హక్కానీ గ్రూప్, అల్​ఖైదా, లష్కరే తోయిబా సహా ప్రముఖ ఉగ్ర సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చింది ఇమ్రాన్ సర్కార్. పాక్-అఫ్గాన్ సరిహద్దులో తలదాచుకుంటున్న తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) ఉగ్రసంస్థపై పూర్తిగా నిషేధం విధించింది.

భద్రతా మండలి జాబితాలోని వీరందరిపై ఇదివరకే నిషేధాజ్ఞలు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై ప్రభుత్వం సమగ్ర నోటిఫికేషన్ జారీ చేసిందని 'ది న్యూస్' వెల్లడించింది.

వైట్ లిస్ట్ కోసం వెంపర్లాట

ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకే పాకిస్థాన్ తాజా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్​ఏటీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే నాలుగు బిల్లులను పాక్ పార్లమెంట్ దిగువసభ ఆమోదించింది. పాక్​ను వైట్​ లిస్ట్​కు మారేలా చేయడమే ఈ నాలుగు బిల్లుల ముఖ్య ఉద్దేశం.

గ్రే లిస్ట్​లో ఉంటే ఏమవుతుంది?

గ్రే లిస్ట్​లో ఉంటే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందడం పాకిస్థాన్​కు కష్టమవుతుంది. ఇప్పటికే ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న పాక్​.. పరిస్థితి మరింత దిగజారకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details